Ap Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు(Ap Rains) కురిసే అవకాశం ఉంది.
- V Santhosh Kumar
- Updated on- June 8, 2026 / 07:34 AM IST
ap weather update heavy rain and extreme heat forecast
- రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు.
- యాభై ఆరు మండలాల్లో వడగాలులు.
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
Ap Rains: కర్ణాటక నుండి కోస్తాంధ్ర తీరం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Ap Rains) కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ జల్లులు పడే వీలుంది. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని సుమారు 56 మండలాల్లో తీవ్రమైన వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. భానుడి భగభగలకు తోడు ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం నాటి గణాంకాల ప్రకారం ప్రకాశం జిల్లా కరేడులో గరిష్ఠంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.
