AP Weather : ఏపీకి మరో వాతావరణ ముప్పు.. నైరుతి రుతుపవనాల నిరాశ.. ఏడు జిల్లాల్లో బెటర్.. 34.9శాతం తక్కువ వర్షపాతం..
AP Weather : ఎల్‌నినో భయాల మధ్య నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిరాశపర్చాయి. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సీజన్ లో కురవాల్సిన వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో పంటల సాగులో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- Harish Thanniru
- Updated on- October 2, 2026 / 07:16 AM IST
AP Weather
AP Weather : ఒకవైపు తరముకొస్తున్న ఎల్‌నినో ముప్పు.. మరోవైపు నైరుతి రుతుపవనాల నిష్ర్కమణతో ఏపీలోని ప్రజలు.. ముఖ్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు వారాలుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే, వర్షాకాలంలో నమోదు కావాల్సిన వర్షపాతం నమోదు కాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : DSC 2.0 Notification : ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు భారీ అప్‌డేట్.. నెల రోజుల్లోనే నోటిఫికేషన్!
ఎల్‌నినో భయాల మధ్య నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిరాశపర్చాయి. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సీజన్ లో కురవాల్సిన వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో పంటల సాగులో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం సీజన్ లో ఏపీలో కురిసిన వర్షాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం.. ఈ సీజన్ లో ఏపీ వ్యాప్తంగా సాధారణంగా 589.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 383.6 మిల్లీమీటర్లు వర్షపాతమే నమోదైంది. అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏకంగా 34.9శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో పరిస్థితిని పరిశీలిస్తే. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అన్నమయ్య జిల్లాలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో సాధారణ వర్షపాతం 403.4 మిల్లి మీటర్లు ఉండగా, కేవలం 151.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. మిగిలిన 20 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
మరోవైపు.. రాష్ట్రంలో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ జీవో జారీ చేసింది. ఇందులో 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్టు పేర్కొంది. ప్రకటించిన మండలాల్లో దాదాపు మూడొంతులు తీవ్ర కరువులోనే ఉన్నాయి.
