AP ZPTC MPTC Elections Results : తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆసక్తికర సంఘటన.. టెన్షన్ వాతావరణం.. పోలీసుల పటిష్ఠ భద్రత
AP ZPTC MPTC Elections Results : తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ, టీడీపీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పులివర్తి నాని కుటుంబాలు ఒకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడం ఒక విధంగా ఉద్రిక్తంగా వాతావరణంతోపాటు.. చర్చనీయాంశంగా మారింది.
- Harish Thanniru
- Updated on- November 7, 2026 / 10:47 AM IST
AP ZPTC MPTC Elections Results
AP ZPTC MPTC Elections Results : ఏపీ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ, టీడీపీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పులివర్తి నాని కుటుంబాలు ఒకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడం ఒక విధంగా ఉద్రిక్తంగా వాతావరణంతోపాటు.. చర్చనీయాంశంగా మారింది.
Also Read : YS Sharmila : చీరాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు.. వైఎస్ షర్మిల సంచలన ట్వీట్.. వైసీపీని వెనక్కినెట్టి..
తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు హర్షిత్ రెడ్డి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో తనయుడి ఓట్ల లెక్కింపును పరిశీలించేందుకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన భార్య లక్ష్మితో కలిసి కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. మరోవైపు తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధనలక్ష్మి తరఫున పులివర్తి నాని తన భార్య సుధారెడ్డితో కలిసి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. దీంతో ఒకే స్థానానికి పోటీ పడుతున్న ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఒకేచోట కనిపించడం అక్కడ ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్ కేంద్రంలో ఈ దృశ్యం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. అయితే, మరోవైపు పోలీసులు ఆ ప్రాంతంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా చర్యలు చేపట్టారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి మధ్య జరిగిన సంభాషణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తిరుపతి రూరల్ మండలంలో పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం వేళ స్వల్ప ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాని సతీమణి సుధారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సప్తగిరి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాడని తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. దీంతో చెవిరెడ్డిని అన్నా అని సంభోదిస్తూ.. ఎక్కడా గలాటా జరగొద్దు.. లేని కొట్లాటలు చూపించొద్దు. నానెన్స్ క్రియేట్ చేయొద్దు. పోలింగ్ జరిగే ప్రాంతాలకు కలిసే వెళదాం. కావాలంటే ఒకే కారులో వెళ్లి పరిశీలిద్దాం అని చెవిరెడ్డితో అన్నారు. పలు పోలింగ్ కేంద్రాల వద్దకు చెవిరెడ్డి వెంట ఆమె కూడా వెళ్లారు. అయితే, చెవిరెడ్డి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చెవిరెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చెవిరెడ్డి, పులవర్తి నాని కుటుంబాలు ఓట్ల లెక్కింపును పరిశీలించేందుకు ఒకే కేంద్రంలో తిష్టవేయడం స్థానికంగా చర్చనీయాంశగా మారింది.
ఇదిలాఉంటే.. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 31 జడ్పీటీసీ, 302 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో మొదలైన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రైల్వేకోడూరు, తిరుపతి, నాయుడుపేట, సూళ్లూరుపేట, సత్యవేడు, నారాయణవనం, శ్రీకాళహస్తి, వెంకటగిరిలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
