APPSC Notification: ఇంజినీరింగ్ అభ్యర్థులకు APPSC గుడ్ న్యూస్.. 503 AEE పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే!
ఏపీపీఎస్సీ(APPSC Notification) 503 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- V Santhosh Kumar
- Published on- October 16, 2026 / 03:08 PM IST
Appsc aee recruitment notification released 503 posts apply online
APPSC Notification: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ తీపి కబురు అందించింది. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 503 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (APPSC Notification) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాల వంటి ప్రముఖ ప్రభుత్వ శాఖల్లో ఈ నియామకాలు చేపట్టనుండటంతో, బీఈ, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఇది అత్యుత్తమ అవకాశంగా నిలవనుంది.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
మొత్తం 503 పోస్టులలో జలవనరుల శాఖలో అత్యధికంగా 224 ఖాళీలు ఉండగా, పంచాయతీరాజ్ విభాగంలో 100, రూరల్ వాటర్ సప్లైలో 73, ఆర్ అండ్ బి (సివిల్) లో 75 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు పబ్లిక్ హెల్త్ విభాగంలో 21, గిరిజన సంక్షేమంలో 6, ఎలక్ట్రికల్ విభాగంలో 4 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు, దరఖాస్తు గడువు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా AMIE ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. జూలై 1, 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్నవారు నవంబర్ 2 నుంచి నవంబర్ 22, 2026 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.
