YS Jagan : అమరావతిలో వైసీపీ నేతలపై దాడి.. వారికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. రెట్టింపు స్పందన ఉంటుందని మర్చిపోవద్దు..

YS Jagan : ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయమని వైఎస్ జగన్ అన్నారు.

YS Jagan

  • అమరావతిలో వైసీపీ నేతలపై దాడి
  • తీవ్ర స్థాయిలో స్పందించిన వైఎస్ జగన్
  • రెట్టింపు స్పందన ఉంటుందంటూ వార్నింగ్

YS Jagan : అమరావతిలో వైసీపీ నేతలపై జరిగిన దాడిని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కూటమి ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : Telangana SIR : ఏపీలో ఓటుంటే ఇక్కడ SIRలో పేరు నమోదు చేసుకోవచ్చా?

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్‌సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తున్నారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్‌ చేయడం అత్యంత దారుణ అంటూ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగు నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్‌ ప్లాట్ల కింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం.. ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా? అంటూ చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా అని జగన్ ప్రశ్నించారు.

ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరుచేసే దాడులకు వైయస్సార్‌సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ వైయస్సార్‌సీపీ వారికి తోడుగా నిలుస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.