మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగి అటెండర్ మృతి

  • Published On : June 7, 2020 / 07:46 AM IST

విశాఖ జిల్లాలో విషాదం జరిగింది. నక్కపల్లి తహశీల్దార్‌ ఆఫీస్‌లో శానిటైజర్‌ తాగి అటెండర్ సత్తిబాబు మృతి చెందాడు. మంచి నీళ్లు అనుకుని పొరపాటున శానిటైజర్‌ తాగేశాడు సత్తిబాబు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. శనివారం(జూన్ 6,2020) మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. సత్తిబాబుకి విపరీతమైన దాహం వేసింది. పక్కనే శానిటైజర్ బాటిల్ ఉంది. అవి మంచి నీళ్లు అనుకున్న సత్తిబాబు దాన్ని తాగేశాడు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. తోటి ఉద్యోగులు అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ అతడికి ప్రాథమిక చికిత్స అందించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన సత్తిబాబు అర్ధరాత్రి మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ఆదివారం(జూన్ 7,2020) తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తిబాబు మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని చోట్ల ముందుజాగ్రత్తగా శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. చాలా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ శానిటైజర్లు ఉంచుతున్నారు. ఆఫీస్ కి వచ్చే సిబ్బంది, ఇతరులు ముందుగా చేతులకు శానిటైజర్ రాసుకుంటున్నారు. అలా చేయడం ద్వారా కరోనా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే శానిటైజర్ చూడటానికి నీళ్ల లాగానే ఉంటుంది. దీంతో కొంతమంది పొరబడుతున్నారు. మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగేస్తున్నారు. గతంలోనూ పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే స్వల్పంగా అస్వస్థతకు లోనయ్యారు తప్ప ఎవరూ చనిపోలేదు. కానీ, విశాఖ జిల్లాలో తహశీల్దార్ ఆఫీస్ లో పని చేసే సత్తిబాబు మాత్రం చనిపోవడం విషాదం నింపింది.