Cm Chandrababu: పార్లమెంట్ కమిటీల కూర్పుపై సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సూపర్ సిక్స్ అని చెప్పాం.. చెప్పినట్లు అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం అని చంద్రబాబు అన్నారు. మ్యానిఫెస్టోలో అనేక హామీలు ఇప్పటికే నెరవేర్చాం. సకాలంలో పథకాల అమలు వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు.
వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వాళ్లు ఫేక్ ప్రచారాలనే రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుని రోజువారీ రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వాళ్లకు కావాల్సింది.. రాద్దాంతం.. తప్పుడు ప్రచారం.. మంచిపై చర్చ జరగకుండా చూడడం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యం తప్పుడు ప్రచారంతో ప్రభుత్వ పథకాలు, మంచి కార్యక్రమాలపై చర్చ జరగకుండా చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. లో లెవల్ పొలిటికల్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలు వైసీపీ చేస్తోందని విరుచుకుపడ్డారు. వాళ్లే వివాదం సృష్టించి, వాళ్లే క్రైం చేసి, మళ్లీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. (Cm Chandrababu)
అర్హుల పింఛన్ల తొలగించ లేదు.. కానీ వైసీపీ ప్రచారం మాత్రం లక్షల పింఛన్లు తొలగించినట్లు సాగుతోందన్నారు. వైసీపీ ప్రతిపక్షం కాదు, ఒక విష వృక్షం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ విధానాలను, కుట్రలను ఉదాహరణలతో చెబితే ప్రజలు అర్థం చేసుకుంటారని నేతలతో చంద్రబాబు అన్నారు.
గెలిచాం, అధికారంలో ఉన్నాం అని తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండకూడదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలపై చర్చ జరగకూడదనేది వైసీపీ ప్రధాన లక్ష్యం. అని, కానీ చేసిన మంచిని మనం ప్రజలకు నిత్యం వివరించాలని నేతలతో చంద్రబాబు అన్నారు.
సెప్టెంబర్ 6న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహిద్దామన్నారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పెంచుకునేలా పార్టీ నేతలు ప్రజల్లో తిరగాలని చంద్రబాబు సూచించారు. పార్టీలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండాలన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు మరింత బాధ్యతగా ఉండాలని తేల్చి చెప్పారు.
”పార్టీపై ఫోకస్ పెట్టాను. పార్టీలో కింది స్థాయి నుంచి పై వరకు బలమైన స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంట్ కమిటీల నియామకం అత్యంత పాదర్శకంగా, పకడ్బందీగా జరగాలి.
కమిటీ నియామకంలో సోషల్ రీఇంజనీరింగ్ జరగాలి. అన్ని వర్గాలకు, బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలి. మొహమాటాలకు పోయి డమ్మీలు, వీక్ గా ఉండే వాళ్లను పెడితే ప్రభుత్వం, పార్టీ నష్టపోతాయి. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అలసత్వం తగదు. పార్టీ కమిటీలు బలంగా ఉండాలి. యాక్టివ్ గా ఉండాలి” అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Also Read: ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ ఏపీలో పొలిటికల్ ట్విస్ట్‌లు..!
జాగ్రత్త.. ఇక చెప్పటాలుండవు..
”ఇప్పటివరకు దాదాపు 35మంది ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహించా. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరి చేసుకోమని ఒకసారి చెప్తా. అయినా తీరు మారకుంటే రెండోసారి పిలిచి చెప్తా. అప్పటికీ మారకుంటే ఇక చెప్పటాలుండవు. నేను తీసుకోవాల్సిన చర్య తీసుకుంటా.(Cm Chandrababu)
సమన్వయకర్తలు, ఇంఛార్జ్ మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్ధమయ్యేలా చెప్పండి. కూటమి బాగుంటేనే ప్రజలూ బాగుంటారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేసుకుంటూ వెళ్లటం ఎంతమాత్రం సరికాదు.
సెప్టెంబర్ 6న సూపర్ 6 – సూపర్ హిట్ పేరిట అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం. సీనియర్లు ఎంతో బాధ్యతగా ఉంటుంటే.. తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్లు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి కొందరు గాడి తప్పుతున్నారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించను” అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.(Cm Chandrababu)