AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెరిట్ జాబితా రిలీజ్..
అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నట్టు అధికారులు తెలిపారు.

AP Mega DSC 2025: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మెరిట్ జాబితా రిలీజ్ అయ్యింది. శుక్రవారం రాత్రి మెరిట్ లిస్ట్ ను విద్యాశాఖ విడుదల చేసింది. డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే సమాచారం పొందాలని అధికారులు సూచించారు.
‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందుతుందని వెల్లడించారు.
పీజీటీ, ఎస్జీటీ, ఎస్ లు ఇలా అన్ని విభాగాల మెరిట్ లిస్ట్ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయని డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు.
* కాల్ లెటర్ అందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది.
* వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి ముందే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.
* వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్‌ను డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
* సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తర్వాత ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తంగా 3లక్షల 36వేల 307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90శాతం హాజరయ్యారు.