Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి..
Tirumala Temple : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ప్రతీరోజూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
- Harish Thanniru
- Updated on- November 30, 2025 / 02:01 PM IST
Tirumala Temple
Tirumala Temple : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ప్రతీరోజూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే, ప్రస్తుతం తిరుపతి వెళ్లే వారికి బిగ్ అలర్ట్. నైరుతి బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. నాలుగు మాఢ వీధులు జలమయం అయ్యాయి. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తులకు ఇబ్బందులు కలకుగండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తిరుపతి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
బంగాళాఖాతంలో ‘దిత్వాహ్’ తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావం రెండ్రోజులు ఉండే అవకాశం ఉంది. దీంతో మంగళవారం వరకు తిరుపతిలోనూ వర్షాలు దంచికొట్టే అవకాశం ఉంది. తిరుమలకొండపై రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు మాఢ వీధులు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్షపు నీరు ఆలయ ప్రాంగణంలో కూడా కొద్దిపాటి వరదలా చేరడంతో, ఆలయ సిబ్బంది వెంటనే నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు. నాలుగు మాఢ వీధుల్లో నీరు నిలవడంతో భక్తులు నడవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మరోవైపు వర్షపు ఉద్ధృతి కారణంగా టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమలకు వెళ్లే, తిరుమల నుంచి కిందకు వచ్చే రెండు ఘాట్ రోడ్లపై భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, టీటీడీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే అవకాశం లేదా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నందున, అధికారులు ప్రయాణికులను అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
