Andhra Pradesh : ఏపీలో భారీ పేలుడు.. ఓ మహిళా టీచర్ సహా ఆరుగురు మృతి.. వాహనాలు ధ్వంసం
Andhra Pradesh : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పనుల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
- Harish Thanniru
- Updated on- October 24, 2026 / 11:29 AM IST
Blasting Accident During Road Construction Work in Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ పేలుడు సంభవించడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఒకరు మహిళ టీచర్ ఉన్నారు. అనంతగిరి మండలం పినకోట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read : AP Rain Alert : ఏపీపై తుఫాన్ పంజా.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
రోడ్డు పనులకోసం బ్లాస్టింగ్ పనులు చేపట్టగా.. ఇందుకోసం జిలెటిన్ స్టిక్స్‌ను అమర్చేందుకు ప్రత్యేక పరికరాన్ని వినియోగించారు. అయితే, వాహనంలో డీజిల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకొని పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాటికి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలేరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రాణాలు కోల్పోయిన వారిలో డ్రైవర్, నలుగురు కార్మికులతోపాటు ఓ టీచర్ కూడా ఉన్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. టీచర్ రహదారిపై అటువైపు వెళ్తుండగా ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను టీచర్ సునీత (విశాఖ), మణి (దవరాపల్లి), నారాయణ రావు (చీడకాడ), పవన్ కుమార్ (కడప)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటన సమాచారం అందుకున్న హోమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
