రాజధాని మార్పుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం చేశారు.
రాజధాని మార్పుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం చేశారు. అమరావతి రైతులెవరూ ఆందోళన చెందొద్దని.. ఎలాంటి అపోహలకు గురికావొద్దని కోరారు. చంద్రబాబు రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. నేటి(డిసెంబర్ 27,2019) కేబినెట్ భేటీలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు బొత్స.
రాజధాని రగడ నేపథ్యంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ ప్రభుత్వం చేసినట్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ తాము చేయబోమని… గ్రాఫిక్స్, సినిమాలు చూపించమని.. అన్నీ వాస్తవాలే చెబుతామన్నారు బొత్స. అమరావతిలో 50 శాతం నిర్మాణాలు దాటిన భవనాలను పూర్తి చేస్తామన్నారు. మంత్రి మండలి సమావేశంలో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఐదేళ్లు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటి? అని ప్రశ్నించారు.
అమరావతిలో 29 గ్రామాలను అభివృద్ధి చేయాలని కమిటీ సిఫారసు చేసిందన్నారు బొత్స. రాష్ట్ర ఆదాయం..ఖర్చు ఎంతనేదానిపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. 3 ప్రాంతాల్లో రాజధానికి ఎంత ఖర్చవుతుందో మంత్రివర్గ సమావేశం తర్వాత చెబుతామన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని.. రైతులకు ఎలాంటి భయాందోళన అక్కర్లేదన్నారు. చంద్రబాబు మాయలో పడొద్దని రైతులను కోరుతున్నాట్లు తెలిపారు.
ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు బొత్స. వేల కోట్ల అప్పులను చంద్రబాబు లక్షల కోట్లకు తీసుకెళ్లారని.. అమరావతిలో రూ.5,458 కోట్లు మాత్రమే తెదేపా ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. రాష్ట్ర ఆదాయం మేరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాలన్నారు. 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
* రాజధాని మార్పుపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
* సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం
* మంత్రి మండలి సమావేశంలో చర్చించి రాజధానిపై నిర్ణయం
* అమరావతి రైతులకు ఎలాంటి భయాందోళన అక్కర్లేదన్న బొత్స
* ఐదేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఇల్లు ఎందుకు కట్టుకోలేదన్న బొత్స
* చంద్రబాబు మాయలో పడొద్దని రైతులను కోరిన మంత్రి బొత్స