AO Murder: కోటి ఆస్తి కోసం దారుణం.. కుక్కల ఇంజెక్షన్‌తో బావను హత్య చేసిన బావమరిది.. నెల్లూరు జిల్లాలో ఘోరం
బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయాధికారిగా(AO Murder) పనిచేస్తున్న శ్రీహరిని తన బావమరిది దారుణంగా హత్య చేశాడు.
- V Santhosh Kumar
- Published on- July 13, 2026 / 11:56 AM IST
Brother in law kills his bava with a dog injection over property in Nellore district.
- కోటి ఆస్తి కోసం దారుణం.
- విషపు ఇంజెక్షన్లతో కిరాతక హత్య.
- బావమరిది దురాశతో బయటపడ్డ నిజం.
AO Murder: నమ్మిన బావమరిదే కాలయముడిగా మారి, కోటి రూపాయల ఆస్తి కోసం సొంత బావను అత్యంత కిరాతకంగా అంతమొందించిన ఘోర ఉదంతం నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయాధికారి (ఏఓ)గా(AO Murder) పనిచేస్తున్న శ్రీహరి, తన బావమరిది హరికృష్ణను అమితంగా నమ్మి కోటి రూపాయల విలువైన ఆస్తితో పాటు కొంత నగదును కూడా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అయితే, ఆస్తిపై పెంచుకున్న అత్యాశతో బావమరిది హరికృష్ణ, ఎలాగైనా బావను వదిలించుకుని ఆ డబ్బంతా తన వశం చేసుకోవాలని పక్కా వ్యూహం రచించాడు.
ఇటీవల శ్రీహరి ఇల్లు కట్టుకోవడానికి తనకు ఇచ్చిన ఆస్తి, డబ్బు తిరిగి ఇవ్వాలని బావమరిదిని కోరడంతో హరికృష్ణలో మృగం మేల్కొంది. ప్లాన్ ప్రకారం, జూన్ 15న పెంచలకోన ఆలయ దర్శనానికి వెళ్దామని శ్రీహరిని కారులో తీసుకెళ్లాడు. తిరుగుప్రయాణంలో చేజర్ల మండలం వద్ద కారు ఆపి, ముందే సిద్ధంగా ఉంచుకున్న రవీంద్ర, యానాది అనే ఇద్దరి సహాయంతో శ్రీహరికి కుక్కలను చంపే రెండు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి హతమార్చాడు. ఆ తర్వాత గుడి నుంచి వస్తూ గుండెపోటుతో చనిపోయాడని నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హుటాహుటిన అంత్యక్రియలు పూర్తి చేసి శవాన్ని తగులబెట్టేశారు.
అంతా అనుకున్నట్లే జరిగిందని భావించిన హరికృష్ణ, లొట్టలు వేస్తూ శ్రీహరి మిగిలిన ఆస్తులను కూడా తన పేరిట రాయాలంటూ ఆయన భార్య లావణ్యతో గొడవకు దిగాడు. దీంతో అనుమానం వచ్చిన లావణ్య ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, పోలీసులు జరిపిన లోతైన విచారణలో ఈ దారుణ హత్యోదంతం బయటపడింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులైన రవీంద్ర, యానాదిలను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరికృష్ణ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
