Guntur: ఏపీలో దారుణ ఘటన.. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి.. చంద్రబాబు, లోకేశ్ సీరియస్..

Guntur woman Stripped On Road :గుంటూరులో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రం చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్ సీరియస్ అయ్యారు.

Guntur woman Stripped On Road

Guntur Woman Stripped: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను నడిరోడ్డుపై వివస్త్రం చేసి అవమానించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దారుణ ఘటన స్థానికులను రాజకీయ పార్టీలనూ, మహిళా సంఘాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, హోమంత్రి అనిత స్పందించారు. మహిళలపై ఇలాంటి దారుణాలు సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : ఎన్టీఆర్ నాటిన ఒక విత్తనమే మేము.. ఆయన స్వయంగా చెబితే ఈ పనులు ఆపేస్తాం

గుంటూరులో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రం చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 15వ తేదీన రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటుంది. మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా వెంకటరమణమూర్తి సోదరి, ట్రాన్స్ జెండర్ మాధవి ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలి పెట్టాలని బాధితురాలు వేడుకున్నా కనికరించలేదు. బాధితురాలు ఈనెల 16న ఫిర్యాదు చేయడంతో వెంకటరమణమూర్తితోపాటు అతని సోదరితో కలిపి మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో కీలక నిందితుడైన 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గళ్లా మాధవి ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై నారా లోకేశ్ స్పందించారు.‘గుంటూరులో జరిగిన ఘోర సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురయ్యాను. రాజకీయ సంబంధాలు లేదా పార్టీ అనుబంధం తమను కాపాడగలవని భావించే ఎవరైనా తీవ్రంగా పొరబడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రిమినల్ కేసు నమోదు చేయబడింది, నిందితుడిని అరెస్టు చేయడం జరిగింది, ఇందులో ప్రమేయం ఉన్న టీడీపీ కార్యకర్తను పార్టీలోని అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలని నేను ఆదేశించాను. ఇది ఒక స్పష్టమైన హెచ్చరికగా ఉండాలి. ఇలాంటి ప్రవర్తనను ఏమాత్రం సహించరు. మీరు ఒక మహిళను అవమానిస్తే, మనం నిలబడే విలువలను అవమానించినట్లే. మీరు ఎవరైనప్పటికీ, చట్టం పూర్తి కఠిన చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.


గుంటూరు ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా.. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. సమాజంలో ఇలాంటి వాటికి తావులేదని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ అండదండలు ఉన్నా సరే.. చట్టం వదిలిపెట్టదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.