Chandrababu Naidu: పేదల సంక్షేమం కోసం కీలక నిర్ణయం.. వారికి శాశ్వత ఇళ్ల స్థలాలు.. ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్(Chandrababu Naidu) పేద ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ అత్యంత వైభవంగా జరిగింది.
- V Santhosh Kumar
- Published on- October 12, 2026 / 07:43 AM IST
Chief Minister Chandrababu Naidu distributed permanent housing pattas to poor families in Nellore.
Chandrababu Naidu: నెల్లూరు నగరంలోని పూలే బొమ్మ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రత్యేక వేడుకలో పేద ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అమరావతి నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి పట్టాలను అందజేశారు. గత ఎన్నికల ప్రచార సమయంలో కాలువకట్ట ప్రాంతంలో నివాసముంటున్న నిరుపేదలు తమకు నివాస హక్కులు కల్పించాలని కోరగా, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇచ్చిన హామీ మేరకు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఐదు శాఖల సమన్వయంతో మంత్రి నారాయణ చొరవ.. రూ.600 కోట్ల పట్టాల అందజేత:
కాలువకట్ట ప్రాంతంలో దాదాపు 22.31 ఎకరాల్లో కొన్నేళ్లుగా నివాసముంటున్న బాధితుల సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రక్రియలోని చట్టపరమైన అడ్డంకులను తొలగించేందుకు ఏకంగా ఐదు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి, స్వయంగా కేబినెట్ ఆమోదం పొందేలా చేశారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అనంతరం రూ.600 కోట్ల విలువైన 939 శాశ్వత ఇళ్ల పట్టాలను సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు వర్చువల్‌గా అందజేశారు. దీంతో కాలువకట్ట నివాసితుల ఏళ్ల నాటి కల సాకారమైంది.
నెల్లూరు సిటీలో మొత్తం రూ.900 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు.. నిరుపేదలకు ఆర్థిక భద్రత:
నెల్లూరు నగరంలో పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నెల్లూరు నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 58 ఎకరాల విస్తీర్ణంలో రూ.900 కోట్ల విలువ చేసే 2,600 శాశ్వత ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందించిన ఈ శాశ్వత భూహక్కులతో పేదల ఇళ్లలో కొత్త వెలుగులు నిండాయని, ఇది వారికి ఆర్థిక భద్రతతో పాటు సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
