Child Safety in AP : పిల్లల భద్రత కోసం ఏపీ సర్కార్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ప్రతి జిల్లాలో ప్రత్యేక నిఘా కమిటీ!

Child Safety in AP : బాలల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

Child Safety in AP

Child Safety in AP : బాలల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ఒక పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.

Also Read : Srisailam Iconic Bridge : శ్రీశైలం వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సర్వే.. రాత్రివేళల్లోనూ ప్రయాణించొచ్చు..

ఈ కమిటీలో డీజీపీ, సీఐడీ, పోలీసు, విద్యా, కార్మిక, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. చిన్నారులు అదృశ్యమైనప్పుడు ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండేలా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సూచనలు చేస్తుంది.

రాష్ట్రస్థాయి కమిటీతో పాటు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక పర్యవేక్షక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్‌ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ఎస్పీ లేదా పోలీస్‌ కమిషనర్‌ కో-ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో పిల్లల అదృశ్యానికి సంబంధించిన సమస్యలను గుర్తించడం, కిడ్నాప్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం ఈ కమిటీల ప్రధాన బాధ్యత. ముఖ్యంగా బాలల అక్రమ రవాణా జరిగే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ముఠాల కదలికలను గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖలను అప్రమత్తం చేయనున్నారు.

కొందరు పేద, అనాథ పిల్లలను దత్తత పేరుతో ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరిని వెట్టి చాకిరీ, భిక్షాటన, ఇతర అసాంఘిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం పిల్లలు కనిపించకుండా పోయిన తర్వాత వెతకడమే కాకుండా.. అలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్తగా ఏర్పాటు చేయనున్న కమిటీల ద్వారా చిన్నారుల అదృశ్య కేసులపై నిరంతర పర్యవేక్షణ ఉండనుంది. ఈ నిర్ణయం సమర్థంగా అమలైతే చిన్నారుల రక్షణకు మరింత పటిష్టమైన వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తప్పిపోయిన పిల్లలను త్వరగా గుర్తించి వారి కుటుంబాలకు చేర్చడంతో పాటు, బాలల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నారు.