Saikrishna Death Case: సిట్ అధికారులు వేధిస్తున్నారు.. కోర్టుకు సీఐ నాగరాజు సంచలన లేఖ.. సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్
సాయి కృష్ణ (Saikrishna Death Case)కేసులో తాను పూర్తిగా నిర్దోషినని సీఐ నాగరాజు న్యాయస్థానానికి ఒక లిఖితపూర్వక లేఖను సమర్పించారు.
- V Santhosh Kumar
- Updated on- July 3, 2026 / 12:21 PM IST
CI Nagaraju sensational letter to court stating that he has no connection to the Saikrishna lock up death case.
- సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్
- తాను నిర్దోషినంటూ సీఐ లేఖ
- సిట్ అధికారులపై సంచలన ఆరోపణలు
Saikrishna Death Case: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా కస్టడీ పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతుండగా, సస్పెండైన సీఐ నాగరాజు న్యాయస్థానానికి ఒక లిఖితపూర్వక లేఖను సమర్పించారు. ఈ లేఖ ద్వారా కేసు(Saikrishna Death Case)లో సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాను పూర్తిగా నిర్దోషినని, ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు.
ప్రత్యేక విచారణ బృందం (సిట్) అధికారులు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని లేఖలో నాగరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అన్యాయంగా ఈ కేసులోకి లాగుతున్నారని, పైగా తీవ్రంగా బెదిరింపులకు గురిచేస్తూ నిందితుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. అసలు ఈ కేసులో తనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం ఇరికించాలనే ఉద్దేశంతోనే అధికారులు తన కస్టడీని కోరుతున్నారని ఆయన వివరించారు.
ఒకవేళ అధికారులు తనను విచారించాల్సి వస్తే, అది తప్పనిసరిగా తన న్యాయవాది సమక్షంలోనే జరగాలని నాగరాజు కోర్టును అభ్యర్థించారు. విచారణ పేరుతో సిట్ అధికారులు తనను శారీరకంగా, మానసికంగా వేధించకుండా తగిన రక్షణ కల్పించాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. సీఐ రాసిన ఈ లేఖ ఇప్పుడు ఈ కేసులో తీవ్ర సంచలనంగా మారింది.
