Kakinada Explosion: కాకినాడ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. హోంమంత్రికి కీలక ఆదేశాలు
విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడారు చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.
- Naveen
- Updated on- February 28, 2026 / 05:12 PM IST
Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)
- ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- ప్రమాదానికి గల కారణాలపై ఆరా
- బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు
Kakinada Explosion: కాకినాడ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై కాకినాడ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ప్రస్తుతం విజయనగరం పర్యటనలో ఉన్న చంద్రబాబు.. అక్కడి నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రమాద ఘటన వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు అధికారులు.
ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్ లో 20 మంది వరకు పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో బాణసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడం పై విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులను, ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని , బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పేలుడు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో హోంమంత్రి అనిత వేట్లపాలెంకి బయలుదేరారు.
కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో 18 మంది చనిపోయారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
