Cm Chandrababu – MSME Summit: 100 యునికార్న్ సంస్థల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాం- సీఎం చంద్రబాబు
ప్రతీ అంశంలోనూ పెట్టుబడులకు ఆస్కారం ఉంది. నెలకు రూ.లక్ష కోట్ల చొప్పున 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం.
- Naveen
- Published on- May 25, 2026 / 04:27 PM IST
Cm Chandrababu – MSME Summit: విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట ఓ కళా వేదికను ఇవాళ ప్రారంభించుకుని ఎంఎస్ఎంఈ సమ్మిట్ 2026 నిర్వహిస్తున్నామన్నారు. 4.4 ఎకరాల్లో 1.45 చదరపు అడుగుల స్థలంలో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించామన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా స్టార్టప్‌లు, పారిశ్రామిక యూనిట్లు, నిపుణులు, బ్యాంకులు ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలన్నారు.
రూ.500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు కూడా ఇప్పటికే విడుదల చేశామని వెల్లడించారు. రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇవాళ శంకుస్థాపన చేసిన 38 పార్కులతో పాటు వంద పార్కులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామన్నారు చంద్రబాబు.
”ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. శ్రీసిటీ విజయవంతమైన పారిశ్రామిక పార్క్. రూ.28 వేల కోట్ల కార్పస్ ఫండ్ డ్వాక్రా మహిళల సంఘాల వద్ద ఉంది. ఈ ఏడాది 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలను ఎంటర్ ప్రెన్యుర్లుగా మారుస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం. ఏపీ నుంచి 100 యునికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ. దీనిని అందిపుచ్చుకోవాలి. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది మా ప్రభుత్వ నినాదం. ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడి సరుకుగా మారుతుంది. సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థ, ఎంఎస్ఎంఈ ఎకో సిస్టమ్ తయారు కావాలని ఆకాంక్షిస్తున్నా.
క్వాంటం వ్యాలీగా అమరావతి..
మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. స్పేస్, డిఫెన్స్, ఏరో స్పేస్ లాంటి రంగాల్లో ఎంఎస్ఎంఈలు కీలకంగా మారాలి. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం లాంటి టెక్నాలజీని యువత, విద్యా సంస్థలు ఉపయోగించుకోవాలి. అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుంది. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జెన్ జీ, జెన్ ఆల్ఫా, టీనేజర్లకు ఎలాంటి అవకాశాలు కావాలో చెబితే దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. టెక్నాలజీతో అనుసంధానం చేసుకుని జెట్ స్పీడ్ తో అభివృద్ధిలో ముందుకు వెళ్లాలి. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా ముఖ్యమే. మూడు రీజియన్లుగా ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచానికే డేటా సెంటర్‌గా విశాఖను అభివృద్ధి చేస్తున్నాం. స్టీల్ సిటీ, అల్యూమినియం, రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి కీలకమైన పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి.
పుట్టపర్తి నుంచి బెంగుళూరు వరకూ డిఫెన్స్ కారిడార్‌గా మారుతుంది. 36 రోజుల్లోనే 5 జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానం తయారీ టెస్టింగ్ ఫెసిలిటీ రాయలసీమలో ఏర్పాటు అవుతుంది. రూ.40 వేల కోట్లతో ఉద్యాన హబ్‌గా రాయలసీమను తయారు చేస్తున్నాం. సూర్యలంక అత్యుత్తమ బీచ్ గా మారుస్తున్నాం. గ్రాండ్ కాన్యాన్ గా గండికోట లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇలా ప్రతీ అంశంలోనూ పెట్టుబడులకు ఆస్కారం ఉంది. నెలకు రూ.లక్ష కోట్ల చొప్పున 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం.
చిప్ టు షిప్ అన్నది ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా మాన్యుఫాక్చరింగ్‌పై దృష్టి సారించాము. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాదు పరిశ్రమలు గ్రౌండ్ చేసేలా చూస్తున్నాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్నది మా ప్రభుత్వ విధానం. అంబేద్కర్ కళావేదిక లాంటి కన్వెన్షన్ సెంటర్లను రాష్ట్రంలో మరో ఐదింటిని నిర్మిస్తాం” అని చంద్రబాబు తెలిపారు.
Also Read: ఏపీలోని డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త.. ఇలాచేస్తే.. నేరుగా అకౌంట్లలోకి రూ.10లక్షలు..
