Kuppam Railway Station: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కుప్పంలో రైల్వే విప్లవం.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!
కుప్పం(Kuppam Railway Station) నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ రైల్వే ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
- V Santhosh Kumar
- Published on- September 22, 2026 / 07:34 AM IST
CM Chandrababu launches new train halts in kuppam railway station
Kuppam Railway Station: కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ రైల్వే ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (11005), వాస్కోడగామ–వేళంగిణి ఎక్స్‌ప్రెస్ రైళ్ల అదనపు హాల్ట్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించి పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ప్రయాణికులతో నేరుగా మాట్లాడిన సీఎం, వారి సమస్యలు, విజ్ఞప్తులను స్వీకరించారు. కుప్పం ప్రాంతాన్ని కేవలం రవాణా కేంద్రంగానే కాకుండా భవిష్యత్తులో ఆర్థిక, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
ఎకనామిక్ అండ్ కార్గో హబ్‌గా కుప్పం అభివృద్ధి:
రైల్వే (Kuppam Railway Station)కనెక్టివిటీ విస్తరణ ద్వారా కుప్పం ప్రాంతంలో కొత్త ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం కుప్పంలో 59 రైళ్లకు హాల్ట్‌లు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని రైళ్లకు కల్పించేలా కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. పొగురుపల్లి సమీపంలోని డ్రై పోర్టును రైల్వే కనెక్టివిటీతో అనుసంధానించి కార్గో రవాణాను ప్రోత్సహిస్తామన్నారు. అలాగే గుడిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, డీకే పల్లి చెరువు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ROB) నిర్మాణానికి భూసేకరణ, ప్రతిపాదనల ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని వివరించారు.
బెంగళూరు-అమరావతి వందే భారత్.. చిత్తూరు లైన్:
రాబోయే రోజుల్లో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరు–చెన్నై మధ్య నాలుగు వరుసల రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఇది కుప్పం ప్రాంతానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు. కుప్పం నుంచి చిత్తూరుకు రైల్వే లైన్ అనుసంధానించడం ద్వారా తిరుపతికి ప్రయాణం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, త్వరలోనే బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వందే భారత్ రైలు నడిపేలా రైల్వే శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం వెల్లడించారు.
