‘తల్లికి వందనం’ నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఈసారి వారిఖాతాల్లోకే డబ్బులు..
Talliki Vandanam Scheme : ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక ప్రకటన చేశారు.
- Harishth Thanniru
- Published On : April 3, 2026 / 12:20 PM IST
CM Chandrababu Naidu key announcement on Talliki Vandanam Scheme
Talliki Vandanam Scheme : ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక ప్రకటన చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం నిధులను వచ్చే జూన్ నెలలోనే విడుదల చేస్తామని తెలిపారు.
Also Read : Gold Price Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
పాఠశాలలకు మే నెలలో వేసవి సెలవులు రానున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. జూన్ 12వ తేదీనే తల్లికి వందనం నిధులు జమ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా.. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జూన్ నెలలోనే తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుతో అర్హులైన విద్యార్థులకు ప్రతీయేటా ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తోంది. అయితే, ఇందులో స్కూల్, కాలేజీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.2వేలు మినహాయించి.. రూ.13వేలు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థులకు తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
గతేడాది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం డబ్బులను ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తే.. కూటమి ప్రభుత్వం హయాంలో 84.27శాతం మందికి పథకం నిధులు అందచేసినట్లు గతంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు.
ఈ పథకంకు అర్హత పొందాలంటే.. విద్యార్థికి 75శాతం హాజరు ఉండాలి. విద్యార్థి తల్లిపేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానించి (NPCI లింకింగ్) ఉండాలి. బ్యాంకులో లేదంటే నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. అకౌంట్ ఆధార్‌తో లింక్ అయ్యిందో లేదో NPCI అధికారిక వెబ్‌సైట్ https://www.npci.org.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.
