ఆ భూతాన్ని మళ్లీ రాకుండా చూసుకుంటాం.. ఫిక్కీ సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.

Chandrababu

Chandrababu: విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ఐదేళ్ల పాలనపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూతాన్ని మళ్లీ రాకుండా చూసుకుంటామంటూ పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

పెట్టుబడిదారులకు గత ప్రభుత్వం పాలనలో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది. ఆ ఐదేళ్ల పాలన గురించి ఆలోచించొద్దు. ఏపీలో టీడీపీ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలను గత ప్రభుత్వం తరిమేసింది. మళ్లీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమిటని కొందరు అడుగుతున్నారు. ఆ భూతం మళ్లీ రాదు.. నేను పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడి దారులకు నాది హామీ. నేను ఈసారి ఏమరుపాటుగా లేను. ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కేంద్రంలో ఎన్డీయే కంటిన్యూ అయింది కాబట్టే దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు.

రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.