CII Partnership Summit : విశాఖలో సీఐఐ సమ్మిట్‌ ప్రారంభం.. డోలు వాయించి సందడి చేసిన చంద్రబాబు, పవన్.. వీడియో వైరల్

CII Partnership Summit In Visakhapatnam : విశాఖపట్టణంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో సీసీఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది.

CII Partnership Summit

CII Partnership Summit In Visakhapatnam : విశాఖపట్టణంలో సీసీఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. వారంతా సదస్సు ప్రాంగణంలో కలియ తిరిగి వివిధ కళాబృందాల ప్రదర్శనలు తిలకించారు.

Also Read : Arshdeep Singh Engagement : న్యూజిలాండ్‌లో ప్రేయసితో భారత క్రికెటర్ అర్ష్‌దీప్‌ సింగ్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..

సదస్సు ప్రాంగణం వద్దకు వెళ్తున్న సమయంలో థింసా, తప్పెటగుళ్లు, గరగ నృత్యాలతో కళాకారులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌తో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ డోలు వాయించారు. ఆ తరువాత ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను నేతలు అభినందించారు.

ఏ ప్రాంతాల్లో ఏయే పంటలు పడుతున్నాయి, ఏయే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయాన్ని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ చూపుతూ కేంద్రమంత్రికి మంత్రి లోకేశ్ వివరించారు. వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధికి చెందిన గ్రోత్ స్టోరీలను పీయూష్ గోయల్‌కు సీఎం వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధి, దేశాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను డిజిటల్ స్క్రీన్స్ మీద అధికారులు ప్రదర్శించారు.

సదస్సులో వివిధ సంస్థలు ప్రభుత్వంతో 141 ఎంవోయూలు కుదుర్చుకోనున్నాయి. వాటిద్వారా రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.46 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా అధికారులు వేస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు.. వాటి అమలుతో సాధించిన ఫలితాలను బేరీజు వేసుకుంటూ భాగస్వామ్య సదస్సు -2026 అంచనాలను ప్రభుత్వం నిర్దేశించింది.

ఇదిలాఉంటే.. సదస్సు ప్రారంభానికి ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పెట్టుబడిదారుల వివరాలను పవన్ కల్యాణ్ కు లోకేశ్ వివరించారు. ఈ సందర్భంగా లోకేశ్ ను పవన్ అభినందించారు.