CM Chandrababu Naidu : మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ..
CM Chandrababu Naidu : మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
- Harishth Thanniru
- Published On : March 26, 2026 / 08:41 AM IST
CM Chandrababu Naidu
- మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- 14మంది సజీవదహనం.. పలువురికి గాయాలు
- ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
- క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశం
- ప్రమాదానికి గల కారణాలపై నివేదిక అందించాలని సూచన
CM Chandrababu Naidu : ఏపీలోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో 14మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరో 15మందికి గాయాలయ్యాయి. బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్దమయ్యాయి. గాయపడిన వారిని మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read : Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లడంతో 23మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాద ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని దేవునికి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేయాలని మార్కాపురం ఎస్పీకి, జిల్లా కలెక్టర్, అధికారులకు మంత్రి సవిత ఆదేశించారు. ప్రయాణాల్లో నిబంధనలు పాటించాలని, బస్సు డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బస్సుల్లో ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేర్చేలా చూడాలని మంత్రి సవిత సూచించారు.
