Visakha Railway Zone : ఏపీ వాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం.. ఎన్నో ఏళ్ల కల సాకారం..

Visakha Railway Zone : ఏపీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న కల తాజాగా సాకారం అయ్యింది.

CM Chandrababu Naidu thanks to central govt on Gazette Notification for Visakhapatnam Railway Zone

Visakha Railway Zone : ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నాన్ని రైల్వే జోన్ గా ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా.. ఇప్పటి వరకు సానుకూల ఫలితం రాలేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదల చేసింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని.. గెజిట్ విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

2026, జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 463 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతం విశాఖపట్నం డివిజన్‌గా మారి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కిందకు వస్తుందని తెలిపారు. మిగిలిన 696 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేశారు. దీన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉంచారు.

విశాఖ రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని ముడసర్లోవ వద్ద సుమారు 52.2 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో పాటు.. విశాఖ రైల్వే జోన్ కార్యాలయ భవనాలు, ఇతర వసతుల కోసం సుమారు రూ.184 కోట్లు కేటాయించారు. ఈ జోన్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని.. కొత్త రైళ్ల ఏర్పాటుతో, రవాణా సౌకర్యాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.