Datura Flower Curry: సోషల్ మీడియా రీల్స్ చూసి కూర వండుకుని తిన్న కుటుంబం.. నలుగురి పరిస్థితి విషమం
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వచ్చే చిట్కాలు, కొత్త రకం వంటకాలు ప్రయత్నించే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Datura Flower Curry: సోషల్ మీడియాలో వచ్చింది గుడ్డిగా నమ్మడం ప్రాణాలకే ప్రమాదం. ఫేస్ బుక్, ఇన్ స్టాలో వచ్చే రీల్స్ చూసి వాటిని ఫాలో అవ్వడం అంత సేఫ్ కాదు. ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం కలగొచ్చు. ఇన్ స్టా రీల్స్ చూసి కూర వండుకుని తిన్న ఓ కుటుంబం ఆసుపత్రి పాలైంది. ఆ కుటుంబంలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ జిల్లా ఎర్రపాలెంలో ఈ ఘోరం జరిగింది.
ఓ కుటుంబం సోషల్ మీడియాలో వంటలకు సంబంధించిన రీల్స్ చూస్తుండగా.. ఉమ్మెత్త పువ్వు కూరకు సంబంధించిన వీడియో ఒకటి వారికి కనిపించింది. మామూలు ఆకుకూరలు మాదిరే ఉమ్మెత్త పువ్వు కూర కూడా మంచి బలం అని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆ వీడియోలో ఉంది. అంతే, అది నిజమో కాదో తెలుసుకోకుండా దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయారు. ఏ మాత్రం లేటు చేయకుండా ఉమ్మెత్త పువ్వులతో కూర వండుకున్నారు. పప్పుతో కలిపి తిన్నారు.
ఇది కాస్తా ప్రాణం మీదకు తెచ్చింది. కూర తిన్న కాసేపటికే నలుగురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఒకే కుటుంబానికి చెందిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మిలుగా గుర్తించారు. వీరు హైదరాబాద్ లో ఉంటారు. అమ్మవారి జాతర కోసం సొంతూరికి వెళ్లారు.
కాగా, ఉమ్మెత్త పువ్వులో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పదార్థాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. అంతేకాదు దానికి ప్రత్యేకమైన విరుగుడు కూడా లేదన్నారు. శరీరంలో విషం శాతం పెరిగితే ప్రాణాపాయం తప్పదన్నారు. ప్రస్తుతం బాధితులు కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఏ మాత్రం అవగాహన లేకుండానే రీల్స్ చూసి విషపూరితమైన మొక్కలను ఆహారంగా వండుకుని తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వచ్చే చిట్కాలు, కొత్త రకం వంటకాలు ప్రయత్నించే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
