టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఐదేళ్ల గడువు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. అక్కడ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగు పడనందునే ఐదేళ్ల గడువును రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు, లీజు ప్రాంతం నుంచి 38,212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాలను అక్రమంగా తవ్వి తీసి.. రవాణ చేయటంపై విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జేసీ బస్సులు సీజ్:
జేసీ బ్రదర్స్‌కు చెందిన బస్సులను ఇటీవలే ప్రభుత్వం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ స్టేజ్ క్యారియర్ బస్సుల పర్మిట్లలో అవకతవకల కారణంగా అధికారులు దాదాపు 36 బస్సులను, అలాగే 18 కాంట్రాక్టు బస్సులను సీజ్ చేశారు. పర్మిట్లలో అవకతవకలకు తోడు నిబంధనలకు విరుద్దంగా బస్సులు నడుస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని అప్పట్లో రవాణా శాఖ అధికారులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం,టికెట్ ధరలను ఇష్టానుసారం పెంచడం వంటి అంశాలపై తమకు ఫిర్యాదులు అందినట్టు చెప్పారు. జేసీ బ్రదర్స్ కు ఇది పెద్ద దెబ్బ. బస్సులు సీజ్ చేయడంతో బాగా నష్టపోయారు. దీన్ని నుంచి కోలుకోక ముందే జగన్ సర్కార్ జేసీకి మరో గట్టి షాక్ ఇచ్చినట్టు అయ్యింది.
జగన్ ప్రతీకారం తీర్చుకుంటున్నారా?
సిమెంట్ ప్లాంట్ నిర్మాణం పేరుతో మైనింగ్ లైసెన్సులు పొంది, ఖనిజాన్ని వేరే వాళ్లకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు జేసీపై ఉన్నాయి. దానిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఆలస్యం కారణంగా లీజును రద్దు చేయడం సరికాదని జేసీ అనుచరులు అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. బస్సులను సీజ్ చేసిన సమయంలోనూ జేసీ తీవ్రంగా స్పందించారు. కేసుల గొడవ కంటే కొంతకాలం ట్రావెల్స్ బిజినెస్ ఆపేయడమే మేలని అన్నారు. ప్రతీకారంతోనే జగన్ ప్రభుత్వం ఇదంతా చేస్తోందని జేసీ ఆరోపించారు. తాజాగా సిమెంట్ కంపెనీ లీజుని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జేసీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.