A Rambabu Representative Image (Image Credit To Original Source)
Ambati Rambabu: మాజీమంత్రి అంబటి రాంబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైనా ఊరట దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మరో కేసులో కోర్టు అంబటికి షాక్ ఇచ్చింది. పీటీ వారెంట్ ఇచ్చింది కోర్టు. దీంతో అంబటి రాంబాబు విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక, తాజాగా అంబటి రాంబాబుపై పోలీసులు కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు.
2023లో సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించి ఆ సమయంలో పెన్షన్ లబ్దిదారుల నుంచి 200 రూపాయలు మినహాయించుకుని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో అంబటిపై కోర్టులో పీటీ వారెంట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారించిన జడ్జి అంబటి రాంబాబును కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే పట్టాభిపురం పీఎస్ లో నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పట్టాభిపురం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను సైతం కొట్టివేసింది. ఇప్పటికే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ రాగా, ఈ కేసులోనూ ఆయనకు రిలీఫ్ దక్కింది. ఈ మేరకు ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. తమ ఎదుట అంబటిని హాజరుపరచాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అంబటి విడుదల మరింత ఆలస్యం కానుంది. ఇక పీటీ వారెంట్ కు సంబంధించి అంబటిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.
Also Read: దువ్వాడ శ్రీనివాస్‌కు క్లాస్ పీకిన వైఎస్ జగన్.. ఏమైందంటే?