YS Jagan CPI Meeting : జగన్‌తో కామ్రేడ్స్ మంతనాలు.. కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది సంకేతమా? ఏపీలో ఆసక్తికర చర్చ
YS Jagan CPI Meeting : ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మాజీ సీఎం జగన్‌ను కలిశారు సీపీఐ నేతలు. జగన్‌తో చాలా సేపు ముచ్చట్లు పెట్టారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
- Harish Thanniru
- Published on- September 26, 2026 / 02:23 PM IST
YS Jagan CPI Meeting
YS Jagan CPI Meeting : వైసీపీ సోలో పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి..మొన్నటి ఎన్నికల వరకు గెలిచినా, ఓడినా ఒంటరి పోరే చేస్తోంది ఫ్యాన్ పార్టీ. వైసీపీ అధినేత జగన్ కూడా సింగిల్‌గానే వస్తామని చెబుతుంటారు. 2024 ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా సరే ఇదే మా రూట్. ఎప్పటికీ అదే రైట్ అన్నట్లుగా వైసీపీ ఓ పొలిటికల్ ఫిలాసఫీతో ముందుకెళ్తోంది. అలాంటి వైసీపీ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్‌లోనూ ఒంటరిగానే బరిలోకి దిగబోతోందా.? లేక ఆ పార్టీ స్ట్రాటజీ ఉలా ఉండబోతోందన్న చర్చ అప్పుడే తెరమీదకు వచ్చింది.
ఈ డిస్కషన్ జరగడానికి ఇంకో కారణం ఉంది. లేటెస్ట్‌గా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి మాజీ సీఎం జగన్‌ను కలిశారు సీపీఐ నేతలు. జగన్‌తో చాలా సేపు ముచ్చట్లు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 26న విజయవాడలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించారు. సీపీఐ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ మీటింగ్‌కు వైసీపీ నేతలు హాజరయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కరువు సమస్యలపై డిస్కస్ చేయడంతో పాటు..భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని అంటున్నారు. ఈ ఈక్వేషన్స్‌లో రాబోయే రోజుల్లో వైసీపీ, కామ్రేడ్స్ కలసి కట్టుగా ఉద్యమించే అవకాశం లేకపోలేదు.
ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఏపీలో మరో కూటమి ఏర్పాటు కాబోతుందా.? కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాలు వైసీపీతో కలిసి పోరాటాలు చేయబోతున్నాయా.? ప్రజా సమస్యలపై ఉమ్మడిగా గళం ఎత్తబోతున్నారా.? అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న కూటమిపై ఉద్యమిస్తున్న వైసీపీతో కలిసి నడుస్తున్నాయి వామపక్షాలు. ఇటీవల అనేక అంశాల్లో వైసీపీతో పాటు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు కామ్రేడ్స్. రైతు సమస్యలు, కూటమి నేతల అవినీతి వంటి అంశాలపై ఆందోళన చేస్తున్నారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆందోళనలకు సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు సపోర్ట్ చేశాయి. శాప్ ఆఫీస్ దగ్గర వైసీపీ నిర్వహించిన నిరసనకు మద్దతు ఇచ్చాయి వామపక్ష పార్టీలు. శాప్ కార్యాలయం దగ్గర జరిగిన ఘటనను ఖండించాయి కమ్యూనిస్ట్ పార్టీలు. వైసీపీ కూడా వామపక్ష పార్టీలు ఇస్తున్న మద్దతును అదనపు బలంగా భావిస్తోంది.
ఎప్పటికప్పుడు అంశాల వారిగా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్న నేపథ్యంలో మరో అడుగు ముందుకేశాయి వైసీపీ, సీపీఐ పార్టీలు. తాడేపల్లి వైసీపీ ఆఫీస్‌కు వచ్చిన సీపీఐ నేతలు జగన్‌ను కలిసి..రాష్ట్రంలో ప్రస్తుత కరువు పరిస్థితులపై చర్చించారు. కరువుపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, రైతులను ఆదుకోవడం లేదని నిరసనలకు సిద్ధం అవుతున్న సీపీఐ ఈ నెల 26న కూటమేతర పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. ఈ మీటింగ్‌కు వైసీపీకి ఆహ్వానం ఇచ్చారు సీపీఐ నేతలు.
కేవలం ఈ అంశమే కాకుండా రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు సీపీఐ లీడర్లు. దీంతో భవిష్యత్‌లోనూ వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటాల్లో పాల్గొనబోతుందనే చర్చ మొదలైంది. అయితే సీపీఐతో పాటు సీపీఎం కలిసి వస్తుందా.? లేదా.? అనేది తెలియాల్సి ఉంది. డీఎస్సీ విషయంలో వైసీపీకి మద్దతు ఇచ్చారు సీపీఎం లీడర్లు. త్వరలో అన్ని అంశాలపై పోరుకు సీపీఎం కూడా కలిసి వస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై పోరాటానికి వామపక్షాలతో కలిసి వెళ్లే అంశంలో వైసీపీ నుంచి సానుకూలమైన సంకేతాలు వస్తున్నాయి. సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి వైసీపీ కీలక నేతలు వెళ్లబోతున్నారు. వామపక్షాలతో వైసీపీ దోస్తీ పోరాటాల వరకేనా..ఎన్నికల్లో పొత్తుకు దారితీస్తుందా.? అనేది వేచి చూడాలి మరి.
