×
Ad

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్టులు.. సీఐడీ మాజీ ఆఫీసర్ల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

టార్చర్ పెడుతున్నట్లు లైవ్‌ వీడియో ఎవరికి చూయించారనే దానిపై కూడా ఆరా తీసే చాన్స్ ఉందని చెబుతున్నారు.

  • ఇప్పటికే సస్పెండ్ అయి కేసులు ఫేస్ చేస్తున్న సునీల్
  •  జైలుకు వెళ్లిన ఐపీఎస్ విజయ్‌పాల్‌, మరో ఐపీఎస్ అరెస్ట్
  • బిహార్‌కు వెళ్లి సునీల్‌ నాయక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Raghu Rama Krishna Raju: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ6గా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు పట్నాకు వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే ఆయనను ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తీసుకురావడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. బిహార్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు వారెంట్, కేసు వివరాలు చెప్పుకుండా సునీల్ నాయక్‌ను ఎలా అరెస్టు చేస్తారని బిహార్ హైకోర్టు ప్రశ్నించి..టాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించినట్లు చెబుతున్నారు.

ఇక నిందితుడు సునీల్ నాయక్ అరెస్టు సమయంలో పట్నాలో హైడ్రామా చోటుచేసుకుందని కూడా తెలుస్తోంది. బిహార్‌లో ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ గత ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ఏపీలో పనిచేశారు. ఏపీ సీఐడీ డీఐజీగా ఆయన పనిచేసిన సమయంలో నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అరెస్టు జరిగింది. అప్పుడు రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగినట్లు 2024లో కేసు నమోదైంది. ఆ కేసు బేస్‌గా అధికారులపై చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు పోలీస్ అధికారులు.

సీఐడీ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌పై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు పడింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. 2020 నుంచి 2024 మధ్య పీవీ సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు సునీల్‌కుమార్‌ సామాన్య ప్రజల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి, కస్టడీలో చిత్రహింసలకు పెట్టారని..పలువురు బాధితుల ఫిర్యాదుల ఆధారంగా..ఓ హైకోర్టు న్యాయవాది కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

Also Read: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. విద్యార్థులు ఇవి గుర్తుంచుకోవాల్సిందే..

ఈ క్రమంలోనే సునీల్‌ను సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్..రఘురామతో పాటు పలువురిని కస్టోడియల్ టార్చర్ పెట్టారన్న అలిగేషన్స్‌పై విచారణకు చేయిస్తుంది. సేమ్‌టైమ్‌ సునీల్ కుమార్‌పై అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రఘురామకృష్ణరాజును వేధించిన కేసు, అగ్రిగోల్డ్‌ కేసు ఫేస్ చేస్తుండటంతో ఆయన సస్పెన్షన్‌ను కంటిన్యూ కొనసాగిస్తూ వస్తోంది ప్రభుత్వం.

విజయ్‌పాల్‌ ఇప్పటికే అరెస్ట్‌
రఘురామ కృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో..ఆయనను విచారించినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న విజయ్‌పాల్‌ ఇప్పటికే అరెస్ట్‌ అయ్యారు. పలుసార్లు విచారణకు హాజరైన విజయ్‌పాల్‌..విచారణకు ఏ మాత్రం సహకరించకపోవడంతో అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు పోలీస్ అధికారులు. అప్పటి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సునీల్‌ కుమార్, సునీల్ నాయక్, విజయ్‌పాల్‌ రెచ్చిపోయారని..రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెడుతూ లైవ్‌ వీడియో చూయించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా సునీల్ నాయక్‌ అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. కోర్టు టాన్సిట్‌ వారెంట్ ఇస్తే కస్టడీలో సునీల్ నాయక్‌ చెప్పే వివరాల ఆధారంగా..సస్పెన్షన్‌లో ఉన్న మాజీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ను కూడా అరెస్ట్ చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. తర్వాత విజయ్‌పాల్‌, సునీల్‌ను విచారించి ..రఘురామ కృష్ణరాజును టార్చర్‌ చేయాలని చెప్పిందెవరు.? ఎవరి ఆదేశాలతో ఆయనను చిత్రహింసలు పెట్టారనే దానిపై వివరాలు సేకరించే అవకాశం ఉందంటున్నారు.

అంతేకాదు టార్చర్ పెడుతున్నట్లు లైవ్‌ వీడియో ఎవరికి చూయించారనే దానిపై కూడా ఆరా తీసే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఒకవేళ సునీల్‌ అరెస్ట్ అయితే మాత్రం ఈ వ్యవహారం అప్పటి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇలా అప్పుడు విజయ్‌పాల్‌..ఇప్పుడు సునీల్‌ నాయక్..నెక్స్ట్‌ సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ ఆ తర్వాత ఎవరు తమ వంతు వస్తుందోనన్న టెన్షన్ కొనసాగుతోంది. అప్పుడు కీలకంగా పనిచేసిన అధికారులు కూడా ఎప్పుడు తమ మెడకు ఉచ్చు బిగుసుకోబోతోందోనని టెన్షన్ పడుతున్నారట. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.