Akvan Cyclone : ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. రెండు రోజులు జాగ్రత్త..
Akvan Cyclone : తుపాను కదలికలను బట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని, అవసరమైన చోట సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
- Harish Thanniru
- Published on- November 16, 2026 / 06:15 PM IST
AP Rain Alert
Akvan Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాను ముప్పు పొంచిఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరికొద్ది గంటల్లో అక్వాన్ తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వాతావరణ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం, వర్ష సూచనలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Lalit Modi : లలిత్ మోదీకి బ్రిటన్ పౌరసత్వం.. ఇక ఇండియాకు తీసుకురాలేమా..? అసలు చట్టం ఏం చెబుతోంది..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో వర్ష సూచనలు ఉన్నట్లు అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. అర్నబ్ తుపాను తరహాలోనే ప్రభావం చూపే అవకాశం ఉందని, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు సహా వివిధ జిల్లాల్లో ప్రభావం ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు.
వాయుగుండం తుపానుగా మారితే ఎప్పటికప్పుడు దాని కదలికలను గమనిస్తూ పరిస్థితిని అంచనా వేయాలని సీఎం సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని, అవసరమైన చోట సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇటీవల కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. వాటిని కేవలం నివేదికలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు, ప్రజల రక్షణ, సహాయక చర్యల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
