Cyclone Arnab Alert : బంగాళాఖాతంలో అర్నబ్ బీభత్సం.. ఏపీకి భారీ తుపాను ముప్పు.. 140 కి.మీ వేగంతో గాలులు..

Cyclone Arnab Alert : బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ తీరానికి భారీ ముప్పు, గంటకు 140 కి.మీ వేగంతో గాలులు, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

Cyclone Arnab Alert

  • ఏపీ తీరానికి ముప్పు ముంచుకొస్తోందా?
  • ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తం ఉండండి
  • భారీ వర్షాలు, బలమైన గాలుల హెచ్చరిక
  • ప్రకృతి ప్రకోపానికి సిద్ధంగా ఉండండి..

Cyclone Arnab Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. తుపాన్ క్రమంగా బలపడుతూ తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయాందోళన నెలకొంది. మరోవైపు, అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలకు రెడీ అవుతున్నారు. వాతావరణ పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచుతూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు : 
అంచనాల ప్రకారం.. ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపాన్ తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉంది. రేపటి (మంళవారం)కి అతి తీవ్ర తుపాన్‌గా బలపడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉండగా, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

అత్యంత భారీ వర్షాలు కురిచే అవకాశం : 
తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

Read Also : Aadhaar-Pan Verification : ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. మీ ఆధార్, పాన్ అప్‌డేట్ చేశారా? వెరిఫికేషన్‌కు డెడ్‌లైన్ ఇదే..!

శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు పలు జిల్లాల్లోనూ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఉండొచ్చు. కోస్తా తీరం వెంబడి గంటకు 90 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం :
చెట్లు, భారీ హోర్డింగులు, బలహీనమైన భవనాల సమీపంలో ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, ఇప్పటికే ఉన్న పడవలు, వలలను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎగసిపడే అలల దగ్గరకు వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాల్లో 7 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 8 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించవచ్చు. తుపాను సమయంలో అప్రమత్తతే ప్రాణరక్షణ.. వదంతులను నమ్మకుండా అధికారిక సూచనలు పాటిస్తూ, కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచనలు చేశారు.