Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై మొదలైన దసరా ఉత్సవాలు.. తొలిరోజు పోటెత్తిన భక్తులు.. ఉత్సవాల్లో కీలక అంశాలివే..
Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భక్తులు పోటెత్తారు.
- Harish Thanniru
- Updated on- October 11, 2026 / 12:17 PM IST
Dasara Sharannavaratri Celebrations on Indrakeeladri
Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు దుర్గాదేవి బాలాత్రిపురసుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనంకోసం తొలిరోజు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారు జామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు.
Also Read : Gold-Silver Prices Today : పండుగల వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. సామాన్య భక్తులకు రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్లు రద్దు చేశారు. ఆదివారం (తొలి రోజు) ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 వరకు ఉచిత సర్వదర్శనం కల్పించారు. మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు.
రూ.1,000 ప్రత్యేక దర్శనం టికెట్లు ‘మన మిత్ర’ వాట్సాప్, అధికారిక పోర్టల్‌లో ఆలయ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. ప్రత్యేక దర్శనం భక్తులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖమండపం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.1,000 టికెట్ భక్తుల కోసం కుమ్మరిపాలెం నుంచి కొండపైకి ఉచిత ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 18వేల మంది వేచి ఉండేలా మూడు హోల్డింగ్ కేంద్రాలు.. క్యూలైన్లలో 8,500 మందికి ఏర్పాట్లు చేశారు. 54 ప్రాంతాల్లో తాగునీరు, 370 మరుగుదొడ్లు, 600 జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేశారు. రోజుకు 15వేల మందికి పైగా అన్నప్రసాదం.. 60 లక్షల లడ్డూల పంపిణీకి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
అక్టోబర్ 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 16న సాయంత్రం అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోంబర్ 20వ తేదీన విజయదశమి ఉత్సవాల ముగింపు సందర్భంగా.. కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం ఉంటుంది.
