AP Rains: కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తర కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. ఆకస్మిక వరదల ముప్పు, ప్రజలు బయటకు రావొద్దన్న అధికారులు!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం(AP Rains) అర్ధరాత్రి రాత్రి 11 నుంచి 1 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం సమీపంలో అధికారికంగా తీరం దాటింది.
- V Santhosh Kumar
- Published on- September 24, 2026 / 08:16 AM IST
Depression crossed coast at Kalingapatnam and heavy rain for North Coastal Andhra.
AP Rains: ఉత్తర కోస్తాంధ్ర తీవ్ర ఆందోళనలో ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి రాత్రి 11 నుంచి 1 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం సమీపంలో అధికారికంగా తీరం దాటింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదిలిన ఈ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరో 12 గంటల పాటు ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగి, ఆ తర్వాత బలహీనపడుతుందని అధికారులు వెల్లడించారు.
48 గంటలు అప్రమత్తత అవసరం – ఎస్‌డిఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు:
తీరం దాటినప్పటికీ రానున్న 48 గంటల పాటు ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయని, దాదాపు 80కి పైగా ప్రాంతాల్లో 100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం (AP Rains)రికార్డయిందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ఆకస్మిక వరదల ప్రమాదం – మత్స్యకారుల వేటపై నిషేధం:
వర్ష తీవ్రత దృష్ట్యా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయి యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ బృందాలు హైఅలర్ట్‌లో ఉన్నాయి. సముద్రం తీవ్ర అలజడిగా ఉన్నందున శ్రీకాకుళం జిల్లా పరిధిలోని మత్స్యకారులు సెప్టెంబర్ 27వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచారు.
