Andhra Pradesh : ఏపీవైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. భీకర గాలులు
Andhra Pradesh : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఉదయం నాటికి వాయుగుండంగా.. ఆ తరువాత తుపానుగా మారే అవకాశం ఉందని.. ఈ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- Harish Thanniru
- Published on- November 14, 2026 / 07:18 AM IST
Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలో మరోసారి వర్షాలు దంచికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారంరోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అత్యధిక స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read : AP DSC 2026 : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఏపీ డీఎస్సీకి అప్లికేషన్ పెట్టారా? లాస్ట్ డేట్ ఇదే!
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా పయనించి రేపు (ఆదివారం) ఉదయానికి వాయుగుండంగా మారుతుందని, సోమవారం సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఈ క్రమంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ తుపానుగా మారితే ఇరాన్ ప్రతిపాదించిన అక్వాన్ పేరు ఖరారు చేయనున్నారు. తుపానుగా ఏర్పడితే ప్రస్తుత సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే మూడో తుపానుగా రికార్డు కానుంది.
ఆదివారం నుంచి సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణ అంచనాల ప్రకారం.. అల్పీపడనం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు–కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, కచ్చితంగా ఏ దిశగా వెళ్తుంది, ఎంతవరకు బలపడుతుంది, ఎక్కడ తీరం దాటుతుంది అనే విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ వాతావరణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
ఏపీని వరుస తుపాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. అర్నబ్, మురసు తుపాన్లు కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. ఇటీవల సంభవించిన మురసు తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే, మురసు తుపాను బీభత్సంతో రాష్ట్రంలో రూ. 2,484.43 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 12 నాటికి 17 రంగాల్లో ఈ నష్టం నమోదైనట్లు తెలిపింది. ఈ నెల 6న కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రాథమిక అంచనా నివేదికలో రూ.1,919.59 కోట్ల నష్టం కలిగిందని పేర్కొనగా.. క్షేత్ర స్థాయిలో గణన తరువాత మరో రూ.564.83 కోట్లు పెరిగిందని వెల్లడించింది.
