Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో జనసైనికులకు ప్రాధాన్యం ఇవ్వాలి.. కూటమి నేతలకు పవన్ కీలక సందేశం!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో జనసైనికులు, వీరమహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కూటమి నేతలకు సూచించారు. అడవితల్లి బాట 2.0, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రూ.2,052 కోట్ల రహదారి పనుల కోసం మంజూరు చేసినట్టు తెలిపారు.
- Sreehari A
- Published on- October 11, 2026 / 04:39 PM IST
Deputy CM Pawan Kalyan
- పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలి
- స్థానిక పోరుకు కూటమి సిద్ధంగా ఉండాలి
- గిరిజన గ్రామాల అభివృద్ధికి భారీ నిధులు
- గిరిజన ప్రాంతాలపై పవన్ ప్రత్యేక దృష్టి
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
కూటమి కోసం కష్టపడిన జనసైనికులు, వీరమహిళలకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి నేతలకు ఆయన సూచించారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పవన్ స్పష్టం చేశారు.
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని కాకవాడ గ్రామంలో ఆదివారం (అక్టోబర్ 10) నిర్వహించిన ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల సేవలను గుర్తించాలని అన్నారు.
Read Also : Mobile Recharge Prices : మొబైల్ యూజర్లకు మరో షాక్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు.. ఈసారి ఎంతంటే?
2014లో కూటమికి మద్దతుగా నిలిచిన జనసైనికులు పదవులను ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలోనూ జనసైనికులు, వీరమహిళలు అండగా నిలిచారని పేర్కొన్నారు.
గిరిజన గ్రామాలకు రూ.2,052 కోట్లతో రహదారులు :
మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే అడవితల్లి బాట 2.0 లక్ష్యమని పవన్ తెలిపారు. ఈ పథకం కింద 1,341 గిరిజన ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే 45 వంతెనలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మొత్తం 2,569 పనులకు రూ.2,052 కోట్లను మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.
గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలతో పాటు మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్, పర్యాటకం, వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 555 రహదారి పనులు, 136 సెల్ టవర్లు, 48 ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు లభించినట్లు వివరించారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం :
2019–2024 మధ్య గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజల అవసరాల కన్నా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం అన్ని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు. రహదారి పనుల నాణ్యతను ప్రజలు పర్యవేక్షించాలని, లోపాలు కనిపిస్తే అధికారులకు తెలియజేయాలని కోరారు. గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధి ఫలాలను ప్రతి ఆవాసానికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
