Milk Contamination: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం రేపాయి. వాటిని తాగిన వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారులు సహా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కల్తీ పాల ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపారు. “నిన్నటి నుంచి వివిధ ఆసుపత్రుల్లో అక్యూట్ కిడ్నీ సమస్యతో పలువురు జాయిన్ అయ్యారు. రాపిడ్ యాక్షన్ టీమ్‌తో సర్వే నిర్వహించాము. 12 మందికి పాల ద్వారా సమస్యలు వచ్చాయి. 106 కుటుంబాలకు పాలవ్యాపారి పాలు విక్రయించాడు. ఇప్పటివరకు 73 బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము. సాయంత్రానికి మిగతావి సేకరిస్తాము. యానిమల్ హస్బండరీ అధికారులు 46 పశువుల శాంపిల్స్ సేకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు” అని తెలిపారు.
రాజమండ్రి ఎస్పీ మాట్లాడుతూ.. పాల వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. చిన్న పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారు బాధితులుగా ఉన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు కనబడితే 9494060060 కి ఫోన్ చేయండి. పాల గురించి మరో రెండు-మూడు రోజుల్లో నివేదిక వస్తుంది.
చంద్రబాబు సమీక్ష
రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో మరణాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయం గురించి సీఎంకు అధికారులు వివరాలు అందించారు.
రాజమండ్రి చౌడేశ్వరి నగర్ భవ్య అపార్ట్మెంట్ ప్రాంతంలో సడన్ గా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు వస్తున్నాయి. అయితే, అందుకు కారణం పాల కల్తీనా? లేదంటే అపార్ట్మెంట్లో ట్యాంక్ క్లీన్ చేయకపోవడం వల్లా? తెలియాల్సి ఉంది.