Ambati Rambabu: ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. విచారణపై ఉత్కంఠ
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు(Ambati Rambabu) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది.
- V Santhosh Kumar
- Published on- September 25, 2026 / 03:36 PM IST
Enforcement Directorate once again issued notices to YSRCP leader Ambati Rambabu.
Ambati Rambabu: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈనెల 28వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. నిజానికి శుక్రవారమే ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలను చూపుతూ హాజరుకాలేనని, మరొక తేదీని కేటాయించాలని ఈడీ అధికారులను కోరారు. దీంతో స్పందించిన ఈడీ, సోమవారానికి విచారణ తేదీని ఖరారు చేసింది. గతంలో ఈనెల 11న ఇచ్చిన నోటీసులు తనకు అందలేదని అంబటి తెలిపిన సంగతి తెలిసిందే.
అనుచరులకు సబ్‌కాంట్రాక్టులు – భారీగా నిధుల మళ్లింపు ఆరోపణలు:
ఈ కేసులో అంబటి రాంబాబు(Ambati Rambabu) పాత్రపై ఈడీ తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. అంబటి తన ప్రధాన అనుచరులైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలకు మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టులను అక్రమంగా ఇప్పించి, తద్వారా భారీ ఎత్తున నిధులు కొల్లగొట్టారని ఈడీ అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు. ఇదివరకే రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అంబటి విచారణకు దూరంగా ఉండటంతో, ఈసారి సోమవారం జరిగే విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మద్యం ముసుగులో జరిగిన నిధుల అక్రమ మళ్లింపు, మనీ లాండరింగ్ కోణాల్లో ఈడీ ఆయనను సమగ్రంగా ప్రశ్నించే అవకాశం ఉంది.
