Ys Jagan Representative Image (Image Credit To Original Source)
Ys Jagan: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి వెళ్లనున్నారు. గవర్నర్ ప్రసంగానికి జగన్, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. గవర్నర్ సమక్షంలో మరోసారి ప్రతిపక్ష హోదా డిమాండ్ ను వైసీపీ ఎమ్మెల్యేలు వినిపించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరుపై వైసీసీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని, జగన్ అసెంబ్లీకి వస్తారని బొత్స తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు అని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్టేషన్ లో ఉన్నారని, ఏదేదో చేద్దామనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అర్ధాకలితో ఉంటే పట్టించుకోవటం లేదని వాపోయారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై బొత్స ధ్వజమెత్తారు.
లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ చెప్పినా.. ఇంకా దాని గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ ఎందుకు? అని నిలదీశారు. సిట్ నివేదిక ఇచ్చాక ఇంకా కమిషన్ వేయటం ఎందుకు? అని చంద్రబాబుని ప్రశ్నించారు. అసలు ఆ కమిషన్ కి చట్టబద్ధత ఉంటుందా? అని అడిగారు. సిట్ నివేదికను చంద్రబాబు బయటపెట్టాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎల్లుండి శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని, అన్ని విషయాలు అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధించి ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు స్పీకర్. ఈ సమావేశంలో సీఎస్ కె విజయానంద్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Also Read: కూటమి పాలనలో కమ్మతనం పోవాలి..! బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?