Vijayawada Railway Bridge : 130 ఏళ్ల చరిత్రకు ముగింపు.. కృష్ణా నదిపై మొట్ట మొదటి రైల్వే వంతేన కూల్చి వేత
Vijayawada Railway Bridge : విజయవాడలో కృష్ణా నదిపై నిర్మించిన తొలి రైల్వే బ్రిడ్జిని త్వరలోనే కూల్చి వేయబోతున్నారు.
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 08:08 PM IST
first railway bridge in vijayawada to be demolished for new one construction
Vijayawada Railway Bridge : విజయవాడ నగరంలో కృష్ణా నదిపై నిర్మించిన మొట్ట మొదటి రైల్వే వంతెన చరిత్ర ఇక కాల గర్భంలో కలిసిపోనుంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ రైల్వే వంతెనని ఇప్పుడు కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో కలపడంలో ఈ రైల్వే వంతెన కీలక పాత్ర పోషించింది. అలాంటి ఈ వంతెనని ఇప్పుడు కూల్చి వేయబోతున్నారు. కారణం విజయవాడ-గూడూరు మార్గంలో రైళ్ల రద్దీ బాగా పెరిగింది. దీంతో రైల్వే శాఖ ఇక్కడ ఆధునిక డబుల్ లైన్ వంతెనని నిర్మించాలని నిర్ణయించింది. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పాత వంతెన పిల్లర్లు అడ్డుగా ఉన్నాయి. వరదలు వస్తే.. ఈ పిల్లర్లు పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జీ మీద పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో.. దీన్ని పూర్తిగా తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఈ బ్రిడ్జిని 1893 మార్చి 17న తొలి మీటర్ గేజ్ బ్రిడ్జ్‌గా నాటి బ్రిటిష్ ఇంజనీర్లు నిర్మించారు. ఆ రోజుల్లో దీనిని ‘కృష్ణా ప్యాలెస్’ అనేవారు. ఈ రైల్వే వంతెన నిర్మాణంలో స్టీల్‌ని ఉపయోగించకపోవడం విశేషం. కేవలం గానుగ సున్నం, రాతి బండలతో మాత్రమే నిర్మించిన ఈ వంతెన నేటికీ కూడా చెక్కు చెదరకపోవడం నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. 1989 వరకు అంటే సుమారు వందేళ్ల పాటు.. లక్షలాది రైళ్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఈ రైల్వే వంతెనని 1993లో అధికారికంగా నిలిపివేశారు.
ఈ బ్రిడ్జి పిల్లర్లు నేటికీ కూడా చాలా దృఢంగా ఉన్నాయి. వాటిని కూల్చడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. హైడ్రాలిక్ క్రేన్లతో పిల్లర్లను కూల్చడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో ప్రస్తుతం ‘లిమిటెడ్ బ్లాస్టింగ్’ పద్ధతిని పరిశీలిస్తున్నారు. ఒక్కో పిల్లర్‌ను తొలగించేందుకు సుమారు 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.
