ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఉచితంగా పెట్రోల్.. ఏపీలో ఇక్కడ బంకుల వద్ద వాహనదారుల బారులు
Andhrapradesh : ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. అయితే, తిరుపతిలో పలు పెట్రోల్ బంకుల్లో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తుండటంతో వాహనదారులు ఆయా బంకుల వద్ద బారులు తీరారు.
- Harishth Thanniru
- Updated on- April 27, 2026 / 12:08 PM IST
Free petrol distribution
Andhrapradesh : ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం నెలకొంది. విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్ బంకులు మూత పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ దొరుకుతుండగా.. ఆయా బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న డీజిల్, పెట్రోల్ సంక్షోభం నేపథ్యంలో వాహనదారులతోపాటు అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోల్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ప్రకారం.. ఆయిల్ కంపెనీలు డీలర్లకు సరఫరా చేసే కోటాను గణనీయంగా తగ్గించాయి. దీనికితోడు రియల్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థలు తమ అవుట్ లెట్లకు సరఫరాను నిలిపివేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల బంకులపై అదనపు భారం పడింది. ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను నింపుకోవడమే కాకుండా.. అదనంగా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ కొరత పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఏపీలోని తిరుపతిలోనూ పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. దీంతో తిరుపతి పట్టణంతోపాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి కష్ట సమయంలో తిరుపతిలోని ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు ఉచిత పెట్రోల్ కోసం బంకు వద్ద బారులు తీరారు.
తిరుపతి తనపల్లి రోడ్డులో ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహన దారులకు ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ పోస్తున్నారు. బంకు యజమాని రొమ్మల రాజేష్ రెడ్డి
ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజట్లో పెట్రోల్ భయాందోళనలు తగ్గేవరకు మాకు సంబంధించిన రెండు పెట్రోల్ బంకుల్లో ఉచితంగానే పెట్రోల్ పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. బంకుల్లో పెట్రోల్ నిలువ ఉన్నంత వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉచితంగానే పెట్రోల్ పంపిణీ చేస్తామని రొమ్మల రాజేష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పెట్రోల్ బంకుల యాజమాని రాజేష్ రెడ్డి తెలిపారు. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వద్ద ద్విచక్ర వాహనదారులు బారులుతీరారు.
