LPG Cylinder eKYC : గ్యాస్ బుక్ చేస్తున్నారా? అక్టోబర్ 1 నుంచి ఈ పని చేయకపోతే రాయితీ సిలిండర్ కట్! వెంటనే ఇలా చేయండి
LPG Cylinder eKYC : రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్లు పొందే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన తీసుకొచ్చింది.
- Harish Thanniru
- Published on- September 20, 2026 / 07:40 AM IST
LPG Cylinder eKYC
LPG Cylinder eKYC : రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్లు పొందే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన తీసుకొచ్చింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ (e-KYC) పూర్తి చేసిన వారికి మాత్రమే రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లు అందనున్నాయి. ఈకేవైసీ పూర్తి చేయని వారికి రాయితీ సిలిండర్ అందించబోమని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
అర్హత కలిగిన లబ్ధిదారులకే ప్రభుత్వ రాయితీ ప్రయోజనం అందేలా చూడటంతో పాటు, గృహావసరాల కోసం ఇచ్చే సిలిండర్లు వాణిజ్య అవసరాలకు మళ్లకుండా నిరోధించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే నకిలీ లేదా అనర్హమైన గ్యాస్ కనెక్షన్లను గుర్తించి తొలగించేందుకు ఈకేవైసీ ప్రక్రియ ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదని, వారికి సాధారణంగానే రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్లు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులు ముందుగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రాయితీ సిలిండర్ పొందే అవకాశం ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 89.9 శాతం మంది గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేశారని, అక్టోబర్ 1వ తేదీలోపు మిగిలిన వారు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ రాయితీ పథకాలలో పారదర్శకత పెంచడం, అర్హులైన కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం అందించడం, గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది.
ఈ-కేవైసీ ఎక్కడ చేయాలి..
♦ డెలివరీ సిబ్బంది వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా వేలిముద్ర/ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా ఈకేవైసీ చేస్తారు.
♦ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు.
♦ వినియోగదారులు ఇంటినుంచీ మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు.
♦ ఇండేన్ గ్యాస్ వినియోగదారులైతే ఇండియన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ వినియోగదారులైతే హలో బీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులైతే హెచ్‌పీ పేయాప్ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు.
