Janasena: నియోకవర్గాల పెంపు ప్రకటనతో లీడర్ల చూపు జనసేనవైపు.. ఎందుకు?

గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. పైగా కార్యకర్త స్థాయి నేతలకు టికెట్‌ ఇచ్చి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం కల్పించారు పవన్.

  • Published On : March 25, 2026 / 08:41 PM IST

ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల పెంపుపై జనసైనికుల హోప్స్
2024లోనే కార్యకర్త స్థాయి నేతలకు జనసేనలో టికెట్లు
యువ నేతలను చట్టసభలకు పంపే యోచనలో పవన్.!
ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వీరమహిళలకు అవకాశాలు..
రాబోయే ఎన్నికల్లో జనసేన స్ట్రైక్ రేట్‌ ఇంకా పెరిగేనా?

 

Janasena: మూడు పార్టీలు. 175 అసెంబ్లీ సీట్లు. 25 లోక్‌సభ స్థానాలు. ఇది పాత లెక్క. ఇప్పుడు సీట్ల సంఖ్య మారబోతోంది. దాదాపు 90 అసెంబ్లీ సీట్లు..మరో 13 లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే జన సైనికుల ఆశలు ఆకాశాన్ని తాకడం పక్కా. డీలిమిటేషన్‌తో జనసేనలో అవకాశాలు దక్కేదెవరికి? సీటు కోసం గ్లాస్‌ పార్టీ వైపు చూస్తున్నదెవరు?

దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపుతో ఏపీ పొలిటికల్స్‌లో సరికొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏపీలో 175గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 269కి, 25 లోక్‌సభ సీట్లు 38కి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సీట్ల పెరుగుదల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఎక్కువ ప్లస్‌ పాయింట్‌ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 175 సీట్లలో 164 సాధించిన కూటమి, 269 సీట్లలో 135 మ్యాజిక్ ఫిగర్‌ను ఈజీగా చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కూటమి పునర్విభజనను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లోనే బలమైన అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతున్న వైసీపీకి..పెరిగే సీట్లలో క్యాండిడేట్స్‌ను నిలబెట్టడం, గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పెద్ద సవాల్‌గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికర సిచ్యువేషన్స్‌ను క్రియేట్‌ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది.

టీడీపీలో టికెట్ ఆశావహులు ఎక్కుగానే ఉంటారు. గత ఎన్నికల్లోనే తమకు సీటు ఇవ్వలేదని అలిగిన నేతలు..సీటు త్యాగం చేసి పదవులు దక్కట్లేదన్న అసంతృప్తిలో ఉన్న నేతలు చాలామందే ఉన్నారు. అలాంటి వారికి సీట్ల పెంపుతో అవకాశం దక్కడం పక్కా. కూటమిగా వెళ్లినా సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపు చంద్రబాబుకు ఈజీ కానుంది. గత ఎన్నికలప్పుడు సీట్ల పంపకాల కోసం పడ్డ ఇబ్బందులు ఈసారి ఉండకపోవచ్చు.

సీట్ల పెంపు.. జనసైనికులకు వరంగా మారే అవకాశం..

ఇక 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్‌ సాధించిన జనసేన వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే సమాయత్తం అవుతోంది. యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే యోచనలో పవన్‌ కల్యాణ్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ, లోక్ సభ సీట్ల పెంపు జనసైనికులకు వరంగా మారే అవకాశం ఉంది. అయితే టీడీపీతో పొత్తులో ఉండటంతో తమకు రాజకీయ అవకాశాలు దక్కవేమోనన్న ఆందోళనలో ఉన్న పలువురు జనసేన నేతలకు గతంలోనే క్లారిటీ ఇచ్చారు పవన్.

యువ నేతలకు, వీర మహిళలకు ఎక్కువ అవకాశాలు..

రిజర్వేషన్లు, స్థానిక పరిస్థితులు, పొత్తులను బట్టి టికెట్లు వస్తాయి. సీటు రాని వారికి నామినేటెడ్‌ పోస్టులు దక్కుతాయంటూ భరోసా ఇచ్చారు. అలా ఆయన మాటే శాసనంగా జనసేన కోసం పని చేస్తున్న వారికి సీట్ల సంఖ్య పెంపు స్వీట్‌ న్యూస్‌గా మారనుంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. పైగా కార్యకర్త స్థాయి నేతలకు టికెట్‌ ఇచ్చి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం కల్పించారు పవన్. రాబోయే ఎన్నికల్లో మరింత మంది యువ నేతలకు అవకాశాలు దక్కనున్నాయి. పైగా మహిళ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే వీర మహిళలకు సీట్లు దక్కనున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు జనసేన వైపు అన్నట్లుగా మారిపోయింది సీన్.

జనసేనలోకి వెళ్తే సీటు గ్యారెంటీ అన్న నమ్మకం..!

జనసేనలోకి వెళ్తే సీటు గ్యారెంటీ. ఇప్పుడీ ఈక్వేషన్ ఏపీ పాలిటిక్స్‌లో తెగ ఇంట్రెస్టింగ్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతున్నవారికి జనసేన బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోందట. ఈసారి పొత్తులో భాగంగా జనసేనకు గతంలో కంటే డబుల్‌, ట్రిపుల్‌ సీట్లు దక్కుతాయని ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 269కి చేరితే జనసేనకు యాభై నుంచి డెబ్బై ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయనేది కొందరి అంచనా. ఇక లోక్‌సభ సీట్లు 38కి పెరిగితే..జనసేన పది దాకా లోక్‌సభ సీట్లలో పోటీ చేసే ఛాన్స్ ఉందనేది ఇంకో లెక్క. ఈ క్రమంలో ఇప్పటి నుంచే జనసేనలో చేరి జనంలోనూ, పవన్‌ దృష్టిలోనూ పడితే టికెట్ తమకే దక్కుతుందని..వన్స్ పార్టీ బీఫామ్‌ దక్కితే గెలుపు ఈజీ అవుతుందని మాస్టర్ ప్లాన్ వేసుకుంటున్నారట పలువురు నేతలు.

ఈ నేపథ్యంలోనే జనసేన తలుపులు తెరిస్తే చాలు గాజు గ్లాస్‌లో టీ తాగేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట పలువురు లీడర్లు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు..జనసేనవైపు చూస్తున్నారట. అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పెంపు జనసైనికులకు, జనసేనకు నయా జోష్‌ తెస్తుందన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.

Also Read: నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఎవరికి లాభం? కూటమికి ప్లస్ అవుతుందా, వైసీపీ పరిస్థితి ఏంటి?