×
Ad

AP Assembly: టార్గెట్‌ వైసీపీ..! జగన్ పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా స్పీకర్ బిగ్ స్కెచ్..!

వేదిక ఏదైనా..మీటింగ్‌ మరేదైనా..వైసీపీని మరింతగా కార్నర్ చేసేలా స్పీకర్ మాట్లాడుతున్న తీరు న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారుతోంది.

Ayyanna Patrudu Chinthakayala Representative Image (Image Credit To Original Source)

  • వైసీపీని వదిలిపెట్టని స్పీకర్ అయ్యన్నపాత్రుడు.!
  • లక్నో టూర్‌లోనూ వైసీపీని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్
  • సభకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారంటూ క్వశ్చన్
  • నో వర్క్..నో పే విధానం అమలు చేయాలంటూ ప్రపోజల్
  • రూల్స్, ఎథిక్స్ అంటూ వైసీపీని కార్నర్ చేస్తున్న స్పీకర్

 

AP Assembly: అమరావతిలో ఉన్నా..హస్తినలో ఉన్నా..లక్నోకు వెళ్లినా ఒకటే లైన్. టార్గెట్‌ వైసీపీ. రూల్స్‌, ఎథిక్స్ అంటూ విపక్షాన్ని కార్నర్ చేస్తున్నారు ఏపీ స్పీకర్. 11 మంది వైసీపీ సభ్యుల తీరుపై ఎప్పటికప్పుడు సరికొత్తగా.. పాత అస్త్రాలనే వాడేస్తున్నారు. సభకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. నో వర్క్‌ నో పే విధానం అమలు చేయాలంటూ ప్రపోజల్ పెడుతున్నారు. స్పీకర్ పెడుతున్న ఒత్తిడితో..వైసీపీ ఓ మెట్టు దిగి సభకు వచ్చేనా?

వేదిక ఏదైనా..డయాస్ మరేదైనా..ఆయన టార్గెట్‌ వైసీపీనే. మరోసారి అసెంబ్లీ సెషన్‌కు టైమ్ దగ్గరపడుతున్న వేళ..ఫ్యాన్ పార్టీ సభ్యుల తీరును చర్చకు పెడుతున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా..జీతాలు తీసుకుంటూ వైసీపీ సభ్యులు సభకు రావడం లేదని ప్రచారం చేస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడి..11 సీట్లకే పరిమితమైనప్పటి నుంచి అసెంబ్లీకి రావడం లేదు వైసీపీ సభ్యులు. బడ్జెట్ సెషన్ మొదటి రోజు సభకు అటెండ్‌ అయి ఆ తర్వాత అటువైపు చూడటం లేదు విపక్షం వైసీపీ. అయితే సభకు అటెండ్‌ కాకున్నా..అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్‌లో మాత్రం సంతకాలు పెట్టి..జీతభత్యాలు తీసుకోవడాన్ని పదేపదే తప్పుబడుతూ వస్తున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

సభకు రాకుండానే జీతాలు, అలవెన్స్ లు..

రూల్స్, ఎథిక్స్ అంటూ ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలను కార్నర్ చేస్తున్నారు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది జీతాలు, అలవెన్స్‌లు తీసుకుంటూ సభకు డుమ్మా కొడుతున్నారని హైలెట్ చేస్తున్నారు స్పీకర్. వైసీపీ ఎమ్మెల్యేల నైతికతను ప్రశ్నిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో సీరియస్ కామెంట్లు చేశారు. ఎథిక్స్ కమిటీ సభ్యులు మూడుసార్లు సమావేశమై..సభకు అటెండ్‌ కాని ఫ్యాన్ పార్టీ శాసనసభ్యుల తీరుపై డిస్కస్ చేశారు.

మరోవైపు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన టార్గెట్ నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్ష వైసీపీ సభ్యులే టార్గెట్‌గా ఆయన చేస్తున్న కామెంట్స్‌, విమర్శలు రాజకీయంగా తీవ్రదుమారం రేపుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని విమర్శలు చేస్తున్న స్పీకర్..జాతీయ స్థాయిలోనూ వైసీపీ ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన చట్ట సభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభకు హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ సభలో మాట్లాడుతూ నో వర్క్-నో పే అంటూ సంచలన ప్రతిపాదన చేశారు. చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు నో వర్క్- నో పే నిబంధన తీసుకురావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.

నేషనల్‌ లెవల్‌లో వైసీపీ తీరును ఎక్స్‌పోజ్..

ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకపోయినా..పనితీరు మార్చుకోకపోతే, ప్రజలు వారిని వెనక్కి పిలిపించేలా “రైట్ టు రీకాల్” హక్కును కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. 2024 జూన్‌లో ఎన్నికైనప్పటి నుంచి కొంతమంది సభ్యులు ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సభకు హాజరు కాలేదని, కనీసం చర్చల్లో కూడా పాల్గొనలేదని స్పీకర్ల సభలో అయ్యన్నపాత్రుడు ప్రస్తావించారు. సభకు రాని సభ్యుల్లో ఎక్కువ మంది వేతనాలు, భత్యాలు మాత్రం తీసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమంటూ నేషనల్‌ లెవల్‌లో వైసీపీ తీరును ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేశారు.

నో వర్క్ నో పే.. రైట్ టు రీకాల్..

సభకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకునేందుకు స్పష్టమైన నిబంధనలు లేనందున, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి మార్గం చూపాలని అయ్యన్నపాత్రుడు కోరారు. ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాల్లో కోత విధించినట్లే, సభకు రాని ప్రజాప్రతినిధులకు కూడా నో వర్క్-నో పే నిబంధన అమలు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తే, రాజ్యాంగాన్ని లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే..వారిని వెనక్కి పిలిపించే “రైట్ టు రీకాల్” హక్కును ఓటర్లకు కల్పించాలని కోరారు.

ఇలా వేదిక ఏదైనా..మీటింగ్‌ మరేదైనా..వైసీపీని మరింతగా కార్నర్ చేసేలా స్పీకర్ మాట్లాడుతున్న తీరు న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారుతోంది. సభకు రాకుండా జీతాలు తీసుకోవడం..ఉద్యోగం చేయకుండా జీతం తీసుకున్నదానికి సమానమని చెప్పుకొస్తున్నారు. దీంతో సాధారణ జనంలో వైసీపీని తీరును స్పీకర్ ఎండగడుతున్నట్లు అవుతోంది. ఈ రకంగా ఎలాగోలా వైసీపీ సభ్యులపై ఒత్తిడి పెట్టి అసెంబ్లీకి రప్పించాలన్నది అధికార కూటమి ప్లాన్‌గా కనిపిస్తోంది. వైసీపీ మాత్రం ఎప్పటిలాగే పాత పాటే పాడుతోంది. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు వచ్చేది లేదని తేల్చి చెబుతోంది. మరి కూటమి బ్లేమ్‌ గేమ్‌ పైచేయి సాధిస్తుందా? లేక వైసీపీ మొండి పట్టు నెరవేరుతుందా అనేది చూడాలి.

Also Read: పాదయాత్ర 2.O.. పాత ఫార్ములా జగన్‌ను తిరిగి పవర్‌లోకి తెస్తుందా?