AP Rajya Sabha Race: 3 పార్టీలు.. 4 సీట్లు.. చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి?
ఈ సారి అనూహ్యంగా ముస్లిం మైనార్టీ వర్గంకు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి బెర్త్ దక్కొచ్చని చెబుతున్నారు.
- Naveen
- Published on- May 22, 2026 / 09:18 PM IST
- నోటిఫికేషన్ రిలీజ్..ఏపీలో పీక్స్‌లో రాజ్యసభ రేస్.!
- మూడు పార్టీలు..నాలుగు రాజ్యసభ సీట్లు..ఎవరికెన్ని.?
- టీడీపీలో పది మందికి పైగా పెద్దల సభ ఆశావహులు
- బీజేపీ, జనసేన అభ్యర్థులు ఖరారు అయినట్లు టాక్.!
- లాబీయింగ్ స్పీడప్..లాస్ట్‌లో ట్విస్టులు ఖాయమా?
- ఏపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టే ఆ నలుగురు ఎవరు?
AP Rajya Sabha Race: ఏడాదిగా జరుగుతున్న చర్చ. ఆరు నెలలుగా కొనసాగుతున్న పెద్దల సభ రేసు. ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చే నెలలోనే ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు భర్తీ కానున్నాయి. దీంతో కూటమిలో పెద్దల సభ బెర్త్ కోసం ఫైట్ పీక్ లెవల్‌కు చేరుకుంది. మూడు పార్టీలు, నాలుగు సీట్లు ఎందరో ఆశావహులు. రాజ్యసభకు వెళ్లేదెవరు? ఇటు చంద్రబాబు, అటు పవన్..మరోవైపు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి?
మూడు పార్టీలు. నాలుగు సీట్లు. ఏపీలో ఇంట్రెస్టింగ్‌గా రాజ్యసభ రేసు. ఇప్పటికే ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉండగా..కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్ 1 నుంచి జూన్ 8వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. జూన్ 18న పోలింగ్..అదే రోజు కౌంటింగ్ నిర్వహించి..ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థుల ఎంపికకు అటు ఇటుగా ఇంకో 15 రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో కూటమి పార్టీల్లో రాజ్యసభ రేసు మళ్లీ పీక్స్‌కు చేరింది. మూడు పార్టీల్లోని ఆశావహులు ప్రయత్నాలను స్పీడప్ చేశారట. ఒక్కసారి రాజ్యసభ బెర్త్ దక్కితే ఆరేళ్ల పాటు పదవిలో ఉండొచ్చు.
బీజేపీ, జనసేనకు చెరొకటి.. టీడీపీకి 2..!
ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి ఎన్ని దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఏపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్య బీజేపీ నుంచి మళ్లీ రాజ్యసభకు వెళ్లారు. విజయ సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో బీజేపీ నాయకుడు పాకా సత్యనారాయణ పెద్దల సభలో ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా బీజేపీకి ఒక సీటు, ఇప్పటివరకు రాజ్యసభ ప్రాతినిధ్యం జనసేనకు ఒక సీటు, టీడీపీ రెండు బెర్తులు తీసుకునేలా ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
టీడీపీకి దక్కే రెండు సీట్లలో ఎవరెవరిని రాజ్యసభకు పంపాలనేది బిగ్ టాస్క్‌గా మారిందట. సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్‌కు రెన్యూవల్ చేయటం ఖాయం అంటున్నారు. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని టాక్. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ..ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య రిక్వెస్ట్ చేస్తున్నారు. 2019కి ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ మినిట్‌లో తనకు రాజ్యసభ అవకాశం చేజారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట.
రేసులో కంభంపాటి, గల్లా జయదేవ్, టీడీ జనార్థన్, కిలారు రాజేష్..
కంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, టీడీ జనార్థన్, కిలారు రాజేష్ రేసులో ఉన్నారు. వీళ్లంతా తమ సీనియారిటీని, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ..అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తే తనను ఎంపిక చేయాలని, ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు పదవిలో ఉన్న ఎం.ఎ.షరీఫ్ కోరుతున్నారు. బీసీ, యువత కోటాలో తన పేరు పరిశీలించాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కోరుతున్నారు. రాయలసీమ నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, బీసీ నేత తిప్పేస్వామి పేర్లు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తున్నాయి.
తమిళనాడు బీజేపీ నేతకు అవకాశం..!
అయితే.. ఈ సారి అనూహ్యంగా ముస్లిం మైనార్టీ వర్గంకు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి బెర్త్ దక్కొచ్చని చెబుతున్నారు. జనసేన నుంచి ఇప్పటి వరకు లింగమనేని రమేశ్ పేరు వినిపించినా..మరో ఇద్దరు ప్రముఖుల పేర్లు ప్రచారంలో వస్తున్నాయి. ఇక..బీజేపీ నుంచి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నామలైకి రాజ్యసభ సీటుపై కూటమి పెద్దలకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చినట్లు టాక్. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా ఈ పేర్లలోనే రాజ్యసభకు తుది ఎంపిక ఉండే అవకాశం ఉంది. కాగా, ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావటంతో మూడు పార్టీల నేతలు వచ్చేవారం సమావేశం కానున్నారు. అధికారికంగా తమ అభ్యర్ధులను ప్రకటించనున్నారు.
Also Read: ఏపీ వాసులకు శుభవార్త.. ఇకపై నిషేధిత జాబితాలో ఉన్న స్థలాల్ని సులభంగా అమ్ముకోవచ్చు
