Representative Image (Image Credit To Original Source)
Chittoor District Mlas: అధికారం ఇక్కడ. ఎమ్మెల్యే పదవి కూడా ఈ రాష్ట్రంలోనే. ఎమ్మెల్యేలు సేద తీరేది మాత్రం పక్క రాష్ట్రాల్లో. ఏపీలోని ఓ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో కంటే పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నారట. వారంలో ఐదారు రోజులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారట. బిజినెస్ వ్యవహారాలు, వ్యక్తిగత పనుల కోసం తరచుగా బయటకు వెళ్తున్నారట. వీక్లీ వన్, టూ టైమ్స్ మాత్రమే చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారట. ఇదంతా జరుగుతోంది ఎక్కడ అనుకుంటున్నారా? స్వయంగా సీఎం సొంత జిల్లాలోనే అన్న చర్చ జరుగుతోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు చాలా చాలా బిజీ. అలా అని సొంత నియోజకవర్గంలో పని ఒత్తిడేమో అనుకుంటే పొరపాటే. సొంత పనులు చక్కబెట్టుకోవడం, వ్యాపార వ్యవహారాలు చూసుకోవడం కోసమే పలువురు ఎమ్మెల్యేలకు టైమ్ సరిపోవట్లేదట. దీంతో తమకు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టిన నియోజకవర్గ ప్రజలకు తప్పనిసరి పరిస్థితుల్లో వారానికి ఒకటి రెండ్రోజులు మాత్రమే టైమ్ కేటాయిస్తున్నారట. దీంతో నియోజకవర్గ ప్రజలు, పార్టీ క్యాడర్ ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యేను కలవాలనుకుంటే కుదరట్లేదట. సార్ ఎప్పుడు నియోజకవర్గానికి వస్తే అప్పుడే వెళ్లి కలవాల్సిన పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చాలా దగ్గర ఒకవైపు చెన్నై..మరోవైపు బెంగళూరు. కాదనుకుంటే నేరుగా హైదరాబాద్. ఎమ్మెల్యేలు ఈ మూడు నగరాలకు పర్యటిస్తూ అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌కు బెంగళూరులో వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో పాటు విద్యా సంస్థలు నడుపుతున్నారు. గురజాల జగన్‌మోహన్ తరచుగా బెంగళూరుకు వెళ్తుంటారు. వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే చిత్తూరుకు వస్తున్నారట. ఇక గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చెన్నైలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిని రన్ చేస్తున్నారట. చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఆయన నడుపుతున్న ఆసుపత్రికి సౌత్ ఇండియాలో చాలా బ్రాంచ్‌లు ఉన్నాయని అంటున్నారు. చెన్నైలో డాక్టర్ థామస్ ఫుల్ టైమ్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉంటారు. వివిధ బ్రాంచ్‌లకు విజిట్ కోసం కూడా వెళ్తుంటారట. నెలలో నాలుగైదు రోజులు మాత్రమే నియోజకవర్గానికి వస్తుంటారని అంటున్నారు.
ఇక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సొంత ఊరు చిత్తూరు. బెంగళూరులో చాలా వ్యాపారాలు ఉన్నాయి. అయన ఎక్కువ సమయం చిత్తూరు, బెంగళూరులోనే ఉంటారు. నెలలో ఐదారు రోజులు మాత్రమే తిరుపతిలో ఉంటున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఇటీవలే బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన కూడా తరచుగా బెంగళూరుకు వెళ్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తరచుగా హైదరాబాద్ వెళ్లి వస్తుంటారు. అక్కడ ఆస్తులతో పాటు ఆయన దగ్గరి బంధువులు ఉన్నారు. నియోజకవర్గానికి నెలలో నాలుగైదు రోజులు మాత్రమే వస్తుంటారు.
ఇక నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చాలా ఏళ్లుగా తిరుపతిలో ఉంటున్నారు. చాలా లో ప్రొఫైల్‌లో ఉంటారు. నెలలో కొద్దిరోజులు మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తారు. పార్టీ క్యాడర్, నగరి ప్రజలకు ఏదైనా అవసరమైతే నేరుగా తిరుపతికి వచ్చి ఎమ్మెల్యేను ఇంట్లోనే కలుస్తుంటారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి. బంధుత్వం కూడా అక్కడే ఎక్కువగా ఉంది. తరచుగా బెంగళూరుకు వెళ్తుంటారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు బెంగళూరులో బిజినెస్‌లు ఉన్నాయి. ఆయన కూడా తరచు బెంగళూరుకు వెళ్ళి వస్తుంటారు.
ఇదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్థితి. ఎమ్మెల్యేల కదలికలపై ఎప్పటికప్పుడు టీడీపీ హైకమాండ్‌కు సమాచారం చేరుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే అధిష్టానం కొందరు ఎమ్మెల్యేలను ఘాటుగా హెచ్చరించినట్లు టాక్. అయినా వ్యాపారాలు, వ్యక్తిగత పనుల కోసం..ఎమ్మెల్యేలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్నారని అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతోనైనా ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఎక్కువ టైమ్ కేటాయిస్తారా..లేదా అన్నది వేచి చూడాలి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కుబేరులు వీరే.. దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ.. ఈసారి 308 మంది..