Rayachoti Tdp: మంత్రి Vs పార్లమెంట్ అధ్యక్షుడు.. రాయచోటిలో తెలుగు తమ్ముళ్ల మధ్య కోల్డ్‌ వార్.. ఆందోళనలో క్యాడర్

నియోజకవర్గ వ్యాప్తంగా సామాజికవర్గంతో పాటు రాయచోటి మున్సిపాలిటీలో సుగవాసి ప్రసాద్ బాబుకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే జిల్లా తరలిపోకుండా చేసే అవకాశం ఉండేదట.

  • Published On : March 17, 2026 / 12:52 AM IST

Representative Image (Image Credit To Original Source)

  • మండిపల్లి వర్సెస్ సుగవాసిగా నడుస్తున్న పొలిటికల్ ఫైట్
  • ఇద్దరు నేతల కోల్డ్‌వార్‌తో కన్‌ఫ్యూజన్‌లో సైకిల్ క్యాడర్
  • లోకల్ బాడీ ఎన్నికల్లోపు లీడర్లు లైన్‌లోకి వస్తారా? లేదా?

 

Rayachoti Tdp: మరో ఆరు నెలల్లో లోకల్ బాడీ పోల్స్ రాబోతున్నాయి. చంద్రబాబు సూచనలతో రాష్ట్రంలో టీడీపీ లీడర్లు అలర్ట్ అయ్యారు. కానీ ఓ నియోజకవర్గంలో మాత్రం మంత్రికి పార్లమెంట్ అధ్యక్షునికి మధ్య జరిగిన కోల్డ్‌ వార్ క్యాడర్‌ను అయోమయంలో పడేసిందట. ఎన్నికల్లోపు ఆ వైరం సెట్ అవుతుందా? లేదా? లోకల్ పోరులోపు ఇద్దరి మధ్య పోరు సెట్ కాకపోతే అధికార పార్టీ లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉందట. ఇంతకు అది ఏ నియోజకవర్గం? అక్కడి లోకల్ వార్ ఏంటి?

రాయలసీమలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిన రాయచోటి నియోజకవర్గంలో..పొలిటికల్ ఈక్వేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ఇద్దరు ముఖ్యనేతల మధ్య గ్యాప్‌ సైకిల్ పార్టీ క్యాడర్‌ను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తుంది. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టు కోసం..పంతం కోసం..ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారట. అయితే మొదటిసారి టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయిన మండిపల్లి అందివచ్చిన అవకాశం అందిపుచ్చుకోవడంలో కాస్త వెనకబడ్డారన్న టాక్ ఉంది. సొంత ఇలాకాలో నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్నారట. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆధిపత్య పోరుకు తెరలేపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మండిపల్లి, సుగవాసి కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం..

మండిపల్లి, సుగవాసి కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం నడుస్తోంది. అయితే ఈ వైరాన్ని సెట్ చేసే క్రమంలో అధినేత చంద్రబాబు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబును నియమించారు. మంత్రి, సుగవాసి ఒక్కటవుతారనుకుని చంద్రబాబు అనుకుంటే మళ్లీ సీన్ మొదటికి వచ్చిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గ లీడర్లు కావడంతో లోకల్ క్యాడర్ విడిపోయి పార్టీ బలహీనంగా కనిపిస్తోందన్న ప్రచారం ఉంది. అసలే జిల్లా కేంద్రం పక్క నియోజవర్గానికి తరలిపోయింది. దాని నుంచి బయటపడడానికే కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఇద్దరు నేతలు కలిసి పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకోవడం కార్యకర్తలను కలవరపెడుతోందట.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపులో రాయచోటి ప్రజానీకంతో పాటు స్థానిక నేతల కో ఆపరేషన్ కూడా ఉందట. సుగవాసి కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా రాయచోటిపై మంచి పట్టు ఉందని చెప్తుంటారు. సుగవాసి ప్రసాద్ బాబు తండ్రి పాలకొండ్రాయుడు ఫ్యామిలీ బ్రాండ్ రాయచోటిలో ఇంకా పదిలంగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఆ ఫ్యామిలీకి గుర్తింపుగా జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ బాబును పెట్టారు చంద్రబాబు. మొన్నామధ్య మదనపల్లిలో జరిగిన సుగవాసి ప్రసాద్ బాబు ప్రమాణస్వీకారంలో మండిపల్లి ఇరువురు నేతలు కనీసం కరాచాలనం చేసుకున్న సందర్భం లేదు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు మంత్రి మండిపల్లి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి ఫరూఖ్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. కానీ పార్లమెంట్ అధ్యక్షుడు లోకల్ లీడర్ సుగవాసి ప్రసాద్ బాబుకు ఆహ్వానం లేదట.

కలిసి పనిచేయాల్సింది పోయి ఎవరిదారి వారిదే..

నియోజకవర్గ వ్యాప్తంగా సామాజికవర్గంతో పాటు రాయచోటి మున్సిపాలిటీలో సుగవాసి ప్రసాద్ బాబుకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే జిల్లా తరలిపోకుండా చేసే అవకాశం ఉండేదట. కానీ ఎవరిదారి వారిదే అన్నట్లుగా నడుచుకోవడంతో జిల్లా కేంద్రం తరలిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నేతల్లో ఉన్న అసంతృప్తిని సెట్ చేసే వీలున్నా పట్టించుకోవట్లేదన్న టాక్ నడుస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే మండిపల్లి, సుగవాసి పంతాలు పట్టింపులు పక్కనపెట్టి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారట క్యాడర్‌. మరి కార్యకర్తల అభీష్టం మేరకు నేతలు కలిసి పనిచేస్తారో లేదో చూడాలి మరి.

Also Read: ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ.. పొరపాట్లతో రాజకీయ జీవితం తారుమారు..! కూటమి లీడర్లు ఎందుకిలా?