కూటమి ప్రభుత్వం టార్గెట్ నెంబర్ 1 ఆయనేనట..! సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎం ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి

మొత్తానికి ముగ్గురు నేతల ముప్పేటదాడిలో పెద్దిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోందంటున్నారు.

Gossip Garage : ఆ నేత రాజకీయాల్లో సీనియర్.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పారు. కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా ప్రత్యర్థులను తొక్కి పడేయాలన్నంత కసితో పావులు కదిపారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. సీన్ రివర్స్ అయింది. రిటన్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఫిక్స్ చేసిన టార్గెట్ నెంబర్ 1 ఆయనేనట. సీఎం చంద్రబాబుతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కుటుంబానికి రాజకీయంగా బద్ధ శత్రువైన ఆ నేతను తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ ముప్పేట దాడితో సదరు సీనియర్ నేత కుటుంబం ఉక్కబోత అనుభవిస్తోంది… ఆపన్న హస్తం కోసం… బీజేపీ అండ కోసం ప్రయత్నిస్తున్నట్లు గాసిప్‌లు షికారు చేస్తున్నాయి.

తొలిసారిగా పెద్దిరెడ్డిని టచ్ చేసిన చంద్రబాబు..
గత ప్రభుత్వ విధానాలపై కూపీ లాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం.. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం సొంత జిల్లాకు చెందిన పెద్దిరెడ్డికి…. చంద్రబాబుతో విద్యార్థి దశ నుంచే రాజకీయంగా వైరం ఉంది. కానీ, ఎప్పుడూ పెద్దిరెడ్డిని టచ్ చేయని చంద్రబాబు.. తొలిసారి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెట్టేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.

సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి..
గత ప్రభుత్వంలో నెంబర్ 2 లీడర్ గా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఇన్నాళ్లు ఆయన అనుచరులుగా చలామణి అయిన నేతలు… టీడీపీలో చేరుతున్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్‌తో సహా 12 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం పెద్దిరెడ్డిని షాక్ కు గురిచేసింది. పెద్దిరెడ్డిపై రాజకీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైచేయి సాధించగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కూడా పెద్దిరెడ్డిపై ఆరోపణలను నిగ్గు తేల్చే పనిని సీరియస్ గా తీసుకున్నారు.

నిధుల మళ్లింపు, ఎర్రచందనం దందాలో పెద్దిరెడ్డి హస్తం?
గతంలో పెద్దిరెడ్డి నిర్వహించిన పంచాయతీరాజ్‌పాటు అటవీశాఖను ప్రస్తుతం డిప్యూటీ సీఎం పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీ రాజ్ నిధుల మళ్లింపును సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం.. బాధ్యులపై చర్యలకు ఆదేశించింది. ఇదే సమయంలో అటవీశాఖ సమీక్ష సమావేశంలో చిత్తూరు జిల్లా నుంచి అక్రమంగా తరలించిన ఎర్రచందనం నేపాల్ భద్రతా బలగాలు సీజ్ చేయడం పవన్ దృష్టికి వచ్చింది. ఈ అక్రమ దందాలో పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న డిప్యూటీ సీఎం… ఆధారాలు సేకరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి… ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని కోరారు.

తండ్రి తరహా రాజకీయాలకు భిన్నంగా కొడుకు రిక్వెస్ట్ మోడ్..
అయితే పెద్దిరెడ్డి తరహా రాజకీయాలకు భిన్నంగా మిథున్ రెడ్డి రిక్వెస్ట్ మోడ్ లో ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. విమర్శలు, ప్రతివిమర్శల ద్వారా వివాదం పెంచుకుని.. మరిన్ని సమస్యలు తెచ్చుకోవడమెందుకనే ఆలోచనకు పెద్దిరెడ్డి కుటుంబం వెళ్లిందంటున్నారు. ఏకకాలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్… పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతుండటమే రాష్ట్ర రాజకీయాల్లో హైలెట్ గా నిలుస్తోంది. ఇద్దరూ కలిసే ఒక వ్యూహం ప్రకారం పెద్దిరెడ్డిని ఇరుకున పెట్టేలా అడుగులు వేస్తున్నారా? లేక అనుకోకుండా అలా జరిగిపోతోందా? అనేది చర్చకు తావిస్తోంది.

అలా.. సీఎం, డిప్యూటీ సీఎంకు శత్రువుగా మారారు..
కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని పెద్దిరెడ్డి, పిఠాపురంలో పవన్‌ వ్యతిరేకంగా మిథున్‌రెడ్డి గతంలో రాజకీయం చేశారు. ఈ విధంగా సీఎం, డిప్యూటీ సీఎంకు పెద్దిరెడ్డి కుటుంబం శత్రువుగా మారింది. ఇక అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి పర్యవేక్షించిన మంత్రిత్వశాఖలను వపన్‌కు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఈ శాఖలపై సమీక్షలు నిర్వహించిన డిప్యూటీ సీఎం గత ప్రభుత్వ వ్యవహరాలను తవ్వితీస్తున్నారు. ఈ క్రమంలోనే నేపాల్‌లోని ఎర్రచందనం పట్టుబడిన విషయం బయటపడిందంటున్నారు. అందుకే పెద్దిరెడ్డి కుటుంబ పాత్రపై బహిరంగ ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం పవన్‌. ఇదే సమయంలో పెద్దిరెడ్డిపై చర్యలు ఉంటాయనేలా హెచ్చరికలు జారీ చేశారు.

చంద్రబాబు, పవన్ కు తోడైన మాజీ సీఎం..
రాజకీయాల్లో 40 ఏళ్లుగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఒకవైపు సొంత జిల్లాలో రాజకీయంగా పెద్దిరెడ్డికి చెక్‌ చెప్పేలా సీఎం చంద్రబాబు యాక్షన్‌ తీసుకోగా, మరోవైపు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పవన్‌ ఆరా తీస్తున్నారు. ఈ ఇద్దరికి తోడు అన్నట్లు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుతోపాటు కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ పెద్దిరెడ్డికి రాజకీయంగా వైరం ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ అండతో ప్రభుత్వం నుంచి రక్షణ పొందాలని పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే… బీజేపీలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటున్నారు. మొత్తానికి ముగ్గురు నేతల ముప్పేటదాడిలో పెద్దిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోందంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు