Nellore Janasena: నడిపించే నాయకుడెవరు? నెల్లూరు జనసేనలో గ్రూప్‌‌వార్.. లీడర్ల తలోదారి..!

ఒకవేళ కార్యక్రమాల్లో పాల్గొన్నా..మెడలో కండువాలు వేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడానికే పరిమితమవుతున్నారు తప్ప..క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచన నాయకుల్లో కనిపించడం లేదని క్యాడర్ ఫీల్ అవుతోంది.

  • Published On : March 17, 2026 / 10:32 PM IST
  • నెల్లూరు జనసేనలో వర్గ విభేదాలతో గందరగోళంలో జనసైనికులు
  • నడిపించే నాయకుడు లేక అంతా అయోమయం
  • అధికారంలోకొచ్చి రెండేళ్లయినా.. ఇప్పటికీ పార్టీకి పెద్ద దిక్కేలేరట

 

Nellore Janasena: కూటమిలో కీలక పార్టీ. వంద శాతం స్ట్రైక్‌ రేటుతో 21 సీట్లు గెలుచుకున్న పార్టీ. పైగా పవర్‌లో ఉంది. అలాంటి పార్టీకి ఆ జిల్లాలో నడిపించే నాయకుడు కరువయ్యాడట. అధికారంలోకొచ్చి రెండేళ్లయినా..ఇప్పటికీ ఆ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కేలేరట. పైగా జిల్లాలో పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉందట. అందులో కూడా గ్రూపుల గోలే ఎక్కువ అంటున్నారు. వర్గాలు వీడి అందరూ కలిసి పనిచేయాలని అధినేత సీరియస్‌ వార్నింగ్ ఇచ్చినా ఏ మాత్రం మార్పు కనిపించడం లేదట. ఇంతకు ఏ పార్టీ.. ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో..2024 ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ సీట్లు టీడీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. టీడీపీ అన్ని స్థానాల్లో విజయం సాధించడం వెనుక కూటమిలోని జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. అయితే అలాంటి జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో నడిపించే రథసారథి లేక అపసోపాలు పడుతుందట. పార్టీ ఆవిర్భావం నుంచి సంస్థాగతంగా పెద్దగా పట్టులేని జనసేన..ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సింహపురిలో ఏ మాత్రం పట్టు సాధించట్లేదట. వర్గ విభేదాలు పార్టీని ఇంకా బలహీనపరుస్తున్నాయని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

పార్టీ కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కూడా జనసేన నేతల మధ్య సమన్వయం లేకుండా పోయిందంటున్నారు. ఎవరికి వారే కార్యక్రమాలు చేస్తూ మమ అనిపించేస్తున్నారట. వర్గ విభేదాలు వీడి అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర రాష్ట్ర నాయకులు వార్నింగ్ ఇచ్చినా కూడా నెల్లూరు జనసేన నేతల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదన్న గుసగుసలు మొదలయ్యాయి.

నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గాలకు సరైన ఇంచార్జ్‌లు లేకపోవడంతో పార్టీ బలోపేతం కావడం లేదని జనసైనికుల ఆవేదన. ఇక నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లల్లో ఎక్కువమంది వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకుంటున్నారే తప్ప పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదన్న విమర్శలున్నాయట. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు, జనసేన నేతలకు మధ్య కూడా సఖ్యత కుదరట్లేదట. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా జనసేన నాయకులు సరిగ్గా పాల్గొనలేకపోతున్నారట. కనీసం ఆహ్వానాలు అందట్లేదంటున్నారు.

టీడీపీ మీద ఆధారపడి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి..

ఒకవేళ కార్యక్రమాల్లో పాల్గొన్నా..మెడలో కండువాలు వేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడానికే పరిమితమవుతున్నారు తప్ప..క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచన నాయకుల్లో కనిపించడం లేదని క్యాడర్ ఫీల్ అవుతోంది. పవన్‌పై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేసినా తిప్పికొట్టే సమర్థవంతమైన నేత జిల్లాలో లేరని గ్లాస్ పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తుందట. ఆఖరికి టీడీపీ మీద ఆధారపడి పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

ఎన్నికల టైమ్ లో వైసీపీలో చేరిన మనుక్రాంత్ రెడ్డి..

జనసేన ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లాకు అధ్యక్షుడిగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఉన్నారు. మొన్నటి ఎన్నికల వరకు పార్టీని ఆయన చురుగ్గా నడిపించారు. సొంత డబ్బులతో పార్టీ కార్యక్రమాలు కూడా చేపట్టారని టాక్. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం..టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆయన ఎన్నికల టైమ్‌లో వైసీపీలో చేరారు. మనుక్రాంత్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత..జిల్లాలో నడిపించే నాయకుడు లేకపోవడంతో సింహపురిలో జనసేన పరిస్థితి దారుణంగా మారిందన్న చర్చ ఉంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ జిల్లా జనసేన బాధ్యతలను మోస్తూ వచ్చారు. అయితే ఆయన తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని పాత నేతలను దూరం పెట్టారన్న విమర్శలు రావడంతో ఆయన్ని కూడా పార్టీ అధిష్టానం జిల్లాకు దూరం చేశారట. ఏడాదికిపైగా నెల్లూరు జిల్లా జనసేనకు అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీలో ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఎవరికి వారే తానే కాబోయే అధ్యక్షుడ్ని అంటూ హడావిడి చేస్తూ వస్తున్నారట. అయితే జిల్లా అధ్యక్షుడి నియామకం జరగకపోవడానికి ఏదో అంతర్గత సమస్య ఉందా అని చర్చించుకుంటున్నారట. ఇప్పటికైనా బలమైన నేతకు పగ్గాలు అప్పగించి..నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని క్యాడర్ కోరుతున్నారు.

Also Read: ఏజెన్సీ ఏరియాలపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..! దీని వెనుక ఇంత వ్యూహం ఉందా?