Pawan Kalyan: ఏజెన్సీ ఏరియాలపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..! దీని వెనుక ఇంత వ్యూహం ఉందా?
రోడ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, వారికి చెప్పులు, దుప్పట్లు, నిత్యావసరాలు వంటివి పంపిస్తూ గిరిజనుల్లో ఆదరణ పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
- గిరిజన, ఆదివాసీలను తమవైపునకు తిప్పుకునే స్కెచ్చా?
- వైసీపీ కోర్ ఓటు బ్యాంకు టార్గెట్‌గా పావులు కదుపుతున్నారా?
- అభివృద్ధి, మౌలిక వసతులతో మనసు గెలుచుకునే వ్యూహం..!
Pawan Kalyan: టార్గెట్ వైసీపీ. కూటమిలోనే ఉంటూ బలపడాలనే ఎజెండా. అందుకే ఫ్యాన్ పార్టీ సాలిడ్ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే ఫిక్స్డ్ టార్గెట్‌తో పావులు కదుపుతున్నారట. ప్రత్యర్థి పార్టీకి పట్టున్న కంచుకోటలను పటాపంచలు చేసేలా వ్యూహాలు రచిస్తున్నారట. ఓ వర్గానికి దగ్గర అయ్యేందుకు..వారిని తనవైపునకు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. పవన్ రాజకీయ ప్రయోగం సక్సెస్ అయ్యేనా? ఇంతకు పవన్ ప్లానేంటి? ఆయన పొలిటికల్ స్కెచ్‌లు ఏంటి?
ఎంత వన్ సైడ్ విక్టరీ సొంతం చేసుకున్నా..వన్ సైడ్ మెజార్టీ ఉన్నా..నెక్స్ట్ ఎలక్షన్ కోసం అప్పుడే వ్యూహాలు రచిస్తోంది కూటమి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే అటు పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే..ఇటు సొంతంగా బలపడేందుకు పావులు కదుపుతున్నారట. ప్రధానంగా వైసీపీకి పట్టున్న ఏరియాలతో పాటు..ఆ పార్టీకి కోర్ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారట.
వైసీపీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునే ప్లాన్…!
రాయలసీమలో వైసీపీ ఓటు బ్యాంకును తమవైపునకు తిప్పుకునే ప్లాన్‌తో పాటు..ఇటు గిరిజన, ఆదివాసీలకు దగ్గరయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారట. ఎలాగైనా సరే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పట్టు సాధించాలనేది పవన్ వ్యూహాత్మక ఆలోచన అంటున్నారు. ఎప్పటికప్పుడు గిరిజన ప్రాంతాల్లో పర్యటనలు పెట్టుకోవడం, వారి ఆచార, వ్యవహారాలను గౌరవిస్తూ, సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు స్పాట్లోనే కొన్ని సమస్యలను సాల్వ్ చేస్తున్నారు.
రోడ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, వారికి చెప్పులు, దుప్పట్లు, నిత్యావసరాలు వంటివి పంపిస్తూ గిరిజనుల్లో ఆదరణ పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజనుల కోసం అడవితల్లి బాట పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి గిరిపుత్రులతో సంబంధాలున్న అటవీ శాఖలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి వారికి మరింత మేలు చేకూరేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల విశాఖ జిల్లా పాడేరు దగ్గరలోని నందిగరువులో ఏకంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించారంటే..పవన్ గిరిజన ప్రాంతాలపై ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా అరకు, మాడుగుల, ఎస్ కోట వంటి గిరిజన నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల పేరుతో పర్యటించారు పవన్. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఇదే తరహాలో పర్యటనలు చేసి పథకాలు అమలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
గిరిజనుల ఓటు బ్యాంక్‌ను పెంచుకోవాలనే స్ట్రాటజీ..
పవన్ కల్యాణ్ ఇంతలా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి విశాఖలో పాడేరు, అరకు, మాడుగుల, ఎస్ కోట అసెంబ్లీతో పాటుగా అరకు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గిరిజనుల ఓటు బ్యాంక్ చాలా కీలకం. ఈ స్థానాల్లో పార్టీ ప్రస్తుతం చాలా వీక్‌గా ఉంది. మారుమూల, కొండశిఖర గ్రామాలకు కూడా పార్టీని తీసుకువెళ్లడం ద్వారా ఓటు బ్యాంక్‌ను పెంచుకోవాలనేది పవన్ ప్లాన్‌గా చెబుతున్నారు. మిగిలిన రాజకీయ పార్టీల కంటే బెటర్ పొజిషన్లో ఏజెన్సీ ఏరియాల్లో జనసేనను నిలపాలన్నది ఆయన వ్యూహమంటున్నారు.
విశాఖలోని గిరిజన ప్రాంతాలు వైసీపీ కంచుకోటలు..
ఉమ్మడి విశాఖలోని గిరిజన ప్రాంతాలు వైసీపీ కంచుకోటలు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా..ఏ ఎన్నికలు జరిగినా..వైసీపీదే హవా అన్నట్లుగా ఉంటుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి గిరిపుత్రులు జగన్‌కు అండగా నిలుస్తూ వస్తున్నారు. జగన్ సారథ్యంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ గిరిజనులు ఆయనవైపే నిలిచారు. ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ తన సత్తా చాటుకోవడానికి ఇప్పటికీ అష్టకష్టాలు పడుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి హవా రాష్ట్రమంతటా సుడిగాలిలా సాగినా, విశాఖ ఏజెన్సీలో మాత్రం వైసీపీ తన కంచుకోటను నిలుపుకుంది. పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాలతో పాటుగా, అరకు పార్లమెంట్ సీటును కైవసం చేసుకుని ఏజెన్సీలో తన బలమేంటో చూపించింది వైసీపీ. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను తమవైపు తిప్పుకోగలిగినా, గిరిజనులను మాత్రం కూటమి తమ వారిని చేసుకోలేకపోయింది. అటు టీడీపీకి, ఇటు జనసేనకు ఇది మైనస్‌గా మారింది.
గిరిజనుల ఓటు బ్యాంకును ఏకపక్షంగా జగన్‌కు వదిలేయడం కూటమి పక్షాలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. అందుకే పవన్ రంగంలోకి దిగారని అంటున్నారు. పదే పదే ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులు, పథకాలకు శ్రీకారం చుడుతూ..ఈ రెండేళ్ల కాలంలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువ పర్యటనలు చేశారు. గిరిపుత్రుల పండుగలకు కూడా పవన్ నేరుగా హాజరవుతున్నారు. దీంతో గిరిజన వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సినీ గ్లామర్ కలగలిసిన పవన్ వంటి పొలిటీషియన్ తమ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటంతో గిరిజనుల్లో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనాని వస్తున్నారంటే చాలు తమ సమస్యలకు ఏదో ఒక మార్గం దొరుకుతుందనే ఆశలు వారిలో కనపడుతున్నాయి. మావోయిస్టుల భయంతో విశాఖ ఏజెన్సీలో అడుగుపెట్టాలంటే ఏ పొలిటీషియన్కైనా సరే దడ పుట్టేది. కానీ ఇప్పుడు పవన్ ఏకంగా గంటల తరబడి వాకింగ్ చేస్తూ కొండలను కూడా ఎక్కేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించడమే కాదు..అక్కడ తన పార్టీ ప్రాతనిధ్యం ఉండాలన్న పవన్ సంకల్పం నెరవేరతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
