Pawan Kalyan: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క.. ఎమ్మెల్యేలకు పవన్‌ చేస్తున్న హెచ్చరికలేంటి?

ఈ మధ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి.. 21లక్షల సభ్యత్వాలు సాధించారు. ఇక గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు కూడా వేగంగా జరుగుతున్నాయ్‌.

  • Updated on- May 26, 2026 / 12:51 AM IST
  • పార్టీపై ఫోకస్ పెంచేసిన జనసేనాని పవన్‌..
  • ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రత్యేక శ్రద్ధ..
  • పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు క్లాస్‌లు..
  • తీరు మారకపోతే వేటు తప్పదని వార్నింగ్‌లు..

Pawan Kalyan: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క ! తీరు మారిందా సరే.. లేదంటే మామూలుగా ఉండదు. ఇలానే కనిపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన ఫైర్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చూస్తూనే.. మరోవైపు పార్టీ మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద ఫోకస్ పెడుతున్నారు. తప్పు చేసినోళ్లకి క్లాసులు ఇస్తూనే.. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదు అంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇంతకీ పవన్ ఎందుకు సీరియస్ మోడ్‌లోకి వచ్చారు.. ఎమ్మెల్యేలకు ఎలాంటి వార్నింగ్‌లు ఇస్తున్నారు..

21మంది ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎంపీలు.. పోటీ చేసిన ప్రతీ స్థానంలో విజయం సాధించి.. హండ్రెడ్‌ పర్సంట్ స్ట్రైక్ రేట్‌లో తెలుగు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది జనసేన. 21మంది ఎమ్మెల్యేల గ్రాఫ్‌ బాగానే ఉన్నా.. రకరకాల ఆరోపణలతో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంలో వివాదాలు కనిపించాయ్‌. ఇది రాజకీయంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండడంతో.. పార్టీపై ఫుల్‌ ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్‌. ఇప్పటివరకు తన శాఖలకు సంబంధించి.. పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టిన ఆయన.. ఇకపై పార్టీ మీద కూడా నజర్ పెట్టేందుకు సిద్ధం అయ్యారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు పాలనపై తనదైన శైలిలో గ్రిప్ తెచ్చుకున్నారు. ఐతే శాఖలపై పట్టు సాధించేందుకు ఇన్ని రోజులు పార్టీ మీద, ఎమ్మెల్యేల మీద పెద్దగా ఫోకస్ పెట్టే సమయం పవన్‌కు దక్కలేదు. ఐతే ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అన్నట్లు.. పార్టీ నిర్మాణం, నేతల తీరుపై దృష్టి సారించేందుకు పవన్‌ సమయం కేటాయిస్తున్నారు.

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై వర్కౌట్‌..

పార్టీ పెట్టి ఇన్నేళ్లు అయినా.. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం మీద ఫోకస్‌ పెట్టలేదు పవన్‌. ఇప్పుడు ఆ పనిలో బిజీగా కనిపిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై వర్కౌట్ చేస్తున్నారు. ఈ మధ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి.. 21లక్షల సభ్యత్వాలు సాధించారు. ఇక గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు కూడా వేగంగా జరుగుతున్నాయ్‌. రానున్న స్థానిక ఎన్నికల్లో స్ట్రాంగ్‌గా నిలబడేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా, నియోజకవర్గ, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు.. నియామకాల విషయంలో పవన్ స్వయంగా పాల్గొంటున్నారు. రక్షణ దళం, నిర్వాహక దళం, పరిపాలక దళం అంటూ.. మూడు కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీతో పాటు కూటమిలో విభేదాల పరిష్కారానికి వివాద విమోచన కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు..

అరవ శ్రీధర్‌తో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా

ఓవైపు పార్టీ నిర్మాణంపై ఫోకస్‌ పెంచుతూనే.. మరోవైపు నేతల తీరుపై కూడా పవన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. నాయకుల వ్యక్తిగత, అవినీతి ఆరోపణలపై ఫోకస్ పెట్టారు. వాటిల్లో నిజం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే.. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, పోలవరం ఎమ్మెల్యే బాలరాజుని పిలిపించుకొని మరీ వార్నింగ్ ఇచ్చారు పవన్‌. హెచ్చరించడమే కాదు.. అరవ శ్రీధర్‌తో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయించారు. బాలరాజుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి.. నాలుగు వారాల్లో వివాదాలు పరిష్కరించుకోవాలని డెడ్‌లైన్ విధించారు. వీళ్లిద్దరే కాకుండా.. ఇకపై ప్రతీరోజూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. ఎమ్మెల్యేలు, నేతల పనితీరుపై సీరియస్ గా ఉండాలని డిసైడ్ అయ్యారట పవన్‌.

క్లాస్‌లు తీసుకుంటూ.. వార్నింగ్‌లు ఇస్తూ.. సీరియస్‌ మోడ్‌

ఇక అటు వచ్చే ఎన్నికల్లోనూ కూటమి కలిసే పోటీ చేస్తుందని ఇప్పటికే హింట్‌ ఇచ్చారు పవన్‌. ఐతే ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని పవన్‌కు నివేదిక కూడా వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో యువకులు, అభిమానులు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను సంతృప్తిపరిచేలా.. పర్యటనలు చేపడుతున్నారు పవన్‌. ఇలా ఒకవైపు టూర్‌లు వేస్తూనే.. మరోవైపు పార్టీలో ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొంటున్న నాయకులకు క్లాస్‌లు తీసుకుంటూ.. వార్నింగ్‌లు ఇస్తూ.. సీరియస్‌ మోడ్‌లో కనిపిస్తున్నారు పవన్‌. పార్టీకి తన మార్క్ రిపేర్లు చేస్తున్నారు. ఓవరాల్‌గా పార్టీ మీద పవన్ ఫోకస్ పెట్టడంతో.. కేడర్‌ చాలా హ్యాపీగా ఫీలవుతోందట. మరి సేనాని నుంచి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉండాయో చూడాలి.

Also Read: వైసీపీ నాయకులు జైలుకెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? వాడుకుంది చాలు.. ఇక ఆపేయండి- పవన్ కల్యాణ్ ఫైర్